Editorial: "వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతున్న వివేకా నీడ.."

Editorial: వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతున్న వివేకా నీడ..
కడప గడపలో వివేకా హత్య ప్రకంపనలు

పులివెందుల గడ్డపై కోరలు చాచిన ఫ్యాక్షన్ పౌరుషం.. రక్తచరిత్రలో సరికొత్త అధ్యాయానికి దారి తీసింది. ఒకప్పుడు ప్రత్యర్థుల మధ్య జరిగిన ఫ్యాక్షన్ వేట.. ఇప్పుడు దశ మార్చుకొని వైఎస్ ఇంటివైపే నడిచింది. కడప ఎంపీ పదవి అనబడే కత్తి వాదరల నెత్తుటి పరంపర.. వైఎస్ కుటుంబంలో వివేకానూ బలిగొంది. ఒకే ఒక వివేకా హత్య వైఎస్ రాజకీయ కోటలో వంద సమీకరణాలకు దారితీస్తోంది. ఈ హత్యతో మొదలైన వైఎస్ కుటుంబంలో సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో రావణ కాష్టం తాలూకు మంటలను ఆరనీయటమే లేదు. పులివెందుల పట్టణంలో జరిగిన ఈ హత్య ఢిల్లీ పురవీధుల్లోనూ ఫుల్లుగా చర్చించుకునే దాకా వెళ్ళిందట.

50 సంవత్సరాల కడప రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిదే పైచేయి. వైఎస్ కుటుంబపు రాజకీయ ఆధిపత్యం రాయలసీమ నడిగడ్డలో పొలిటికల్ పాలెగాళ్ల రక్తం ఏరులై పారించింది. బాంబుల గడ్డ జమ్మలమడుగులో పొన్నపురెడ్డి హత్య నుంచి.. అనంత రాజకీయ తెరపై అలరారిన పరిటాల మరణం వరకూ.. ఇలా సాగిన రాజకీయ రక్తయాత్రలో అసువులు బాసిన అనామకులు వందల్లోనే ఉన్నారు. ఈ విధంగా మొదలైన వైఎస్ మార్క్ ఫ్యాక్షన్ ఒరవడి.. సీమ రాజకీయ ముఖచిత్రంపై అటు రాజశేఖర్ రెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత సొంత కుంపటి పెట్టిన జగన్ తొలిసారి ఎన్నికల్లో సీఎం పీఠానికి కొద్ది దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ కుటుంబం నిలువునా చీలిపోయింది. జిల్లాలో రాజశేఖర్ రెడ్డి తరువాత నెంబర్ టు గా కొనసాగిన వివేకానంద రెడ్డి.. వైఎస్ మరణం తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్య కుటుంబానికి చెందిన బీటెక్ రవిపై దారుణ ఓటమితో పరాభవం పాలయ్యాడు. ఈ ఓటమికి వైఎస్ కుటుంబంలోని కలహాలే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. వివేకా ఓటమి అనంతరం వైఎస్ కుటుంబంలో మొదలైన ముసలం ఆ కుటుంబాన్ని రెండు వర్గాలుగా విడిపోయేలా చేసింది. వైఎస్ బతికున్నప్పుడు ఒకే తాటిపై నడిచిన ఈ కుటుంబం వైసీపీ స్థాపించిన తర్వాత వర్గ పోరుకు నేతృత్వం వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన వైఎస్ వివేకా పలుమార్లు అవినాష్ రెడ్డి, ఇతని కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట. ఇలా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వంట పట్టించుకున్న జగన్.. ఇంటి పోరు విషయంలో మాత్రం ఇట్టే విఫలమయ్యాడట.

తనను ఎమ్మెల్సీగా ఓడించిన పరిణామంపై రివెంజ్ తీర్చుకోవాలన్న వివేకా ఈసారి జరిగే ఎన్నికల్లో అవినాష్ కు ఎంపీ పదవి ఇవ్వద్దంటూ జగన్ తో పేచీకి దిగాడట. ఈ నేపథ్యమే వివేకా హత్యకు దారి తీసిందని లోకం కోడైకుస్తోంది. దీనికి మరింత బలం చేకూరే విధంగా వివేక దారుణ హత్య అనంతరం విచారణ చేపట్టిన సీబీఐ తన అభియోగ పత్రంలోని అనెక్సర్ 6 పేజీ నెంబర్ 21, 22 లో స్పష్టంగా పేర్కొంది. ఇలా కడప ఎంపీ పదవిని ఆశించిన వ్యక్తులు ఒకరు కత్తులకు బలయితే, మరొకరిని కటకటాలు రారమ్మంటున్నాయ్. హత్య కేసులో జగన్ రాజకీయానికి అన్నీ తానై వ్యవహరించిన అనుచరులు జైలు బాట పడుతున్నారు.

ఇలా అర్థ శతాబ్దం కడప రాజకీయంలో ఎంపీ సీటుతో అజమాయిషీ చలాయించిన వైఎస్ కుటుంబం పరపతి నేడు అదః పాతాళానికి పడిపోతోందట. ఇకపోతే వివేకా మరణం, అవినాష్ కు అరెస్టు గండం వెరసి.. ఈచోటి కర్మ ఈచోటే.. ఈనాటి కర్మ మరునాడే అన్నట్లుగా వివేకా హత్య ఉసురు వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. ధర్మమే దండమై సీబీఐ రూపంలో దండిస్తోంది. ఇకపోతే ముఖ్యంగా జిల్లాలో పరిపూర్ణమైన రాజకీయ ప్రగతిని సాధించిన జగన్.. కడప ఎంపీ సీటు అభ్యర్థి ప్రకటనపై పరేషాన్ కి గురవుతున్నాడట. వివేకా హత్యోదంతం అనంతరం జరిగిన కుటుంబ కలహాల్లో భాగంగా జగన్ తల్లి విజయమ్మ లోటస్పాండ్ బాట పట్టగా.. చెల్లి షర్మిల తెలంగాణలో ప్రత్యేక కుంపటి పెట్టింది. దీంతో వారసత్వ ఎంపీ పదవి వైఎస్ కుటుంబాన్ని దాదాపు వీడుతోందన్న ప్రచారం జరుగుతోంది.

కడప ఎంపీగా అవినాష్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. అవినాష్ హత్య కేసు అనిశ్చితినీ, రాజకీయ లోటును భర్తీ చేసే కుటుంబ సభ్యుల కోసం జగన్ ప్రత్యేకంగా శ్రమిస్తున్నారట. తన కుటుంబంలోని ఇతర దాయాదులు వ్యాపార, ఉద్యోగాలకే పరిమితం కావడంతో ఎంపీ బరిలో ఎవరిని దింపాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే వైఎస్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయ అనిచ్చితిని కొంతైనా మెరుగుపరుచుకునేందుకు జగన్ తన మేనమామైన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని జిల్లా నేతలతో ఇప్పటికే సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు నరేన్ రామానుజులరెడ్డిని రాజకీయ తెరపై పరిచయం చేశాడు. సీకే దిన్నె జడ్పీటీసీగా ఉన్న ఇతను భవిష్యత్తు ఎమ్మెల్యేగా అవతరించాలన్నదే రవీంద్రనాథ్ రెడ్డి ధ్యేయమట. ఇందులో భాగంగానే ఇతను కడప ఎంపీ సీటు పై కన్నేశాడట

మొత్తానికి జరుగుతున్న పరిణామాలన్ని చూస్తుంటే వివేకా హత్య కేసులో సీఎం జగన్ తమ్ముడు అవినాష్ జైలు కెళ్లడం ఖాయంగా కనిపిస్తోందన్న చర్చ జోరుగా జరుగుతోంది. అవినాష్ రెడ్డిని వదులుకోబోతున్నామని తెలిసే ప్రత్యామ్నాయంపై జగన్ రెడ్డి దృష్టి పెట్టారని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోందో.

Tags

Read MoreRead Less
Next Story