Editorial: సీదిరి అప్పలరాజుకు పట్టపగలే చుక్కలు

కాలం కలిసి రాకపోతే అన్నీ అప శకునాలే అంటారు పెద్దలు. అచ్చం అలాంటి పరిస్థితులే ఇపుడు శ్రీకాకుళం జిల్లా పలాస అధికార పార్టీలో కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి అప్పలరాజును అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు జగన్ సముచిత స్థానం కల్పించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇపుడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే అప్పలరాజును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. సొంత మనుషులే రెబల్స్ గా మారి మంత్రిగారిని తెగ టెన్షన్ పెడుతున్నారట.
పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు పేరు చెబితే ద్వితీయశ్రేణి నేతలంతా రగిలిపోతున్నారట. ఓ మాటలో చెప్పాలంటే ఆయన నాయతక్వం మాకొద్దు అంటూ బహిరంగంగానే చెప్పేస్తున్నారట. అప్పలరాజు ఎమ్మెల్యే అయిన మొదట్లో పరిస్థితులు అంతా బాగానే ఉండేవి. నియోజకవర్గంలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి... ఎవరు పార్టీ గెలుపు కోసం కృషి చేశారు.. అనే అంశాల ప్రాతిపదికన నేతలకు ప్రాధాన్యం లభించేది. కానీ మంత్రి పదవి వచ్చాక అప్పలరాజు వ్యవహారశైలిలో పూర్తిగా మార్పు కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇపుడు మంత్రి చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని ఆ కోటరీలో ఉన్న నేతలు చెప్పిన మాటలే మంత్రిగారు వింటున్నారని ఓ వర్గం చెబుతోంది.
ఇటీవల పలాస నియోజకవర్గం అధికార పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. మంత్రి అనుచరులంతా ఓ వైపు, ఆయన వ్యతిరేక వర్గం మరోవైపు అన్నట్టు పలాస అధికార పార్టీ రాజకీయం సాగుతోంది. అసమ్మతివర్గం నేతలు రోజు రోజుకూ స్పీడ్ పెంచుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహించి మంత్రి వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారు. ఇక్కడితో ఆగకుండా ఈసారి అప్పలరాజుకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. మరోవైపు అధిష్టానం పెద్దలకు మంత్రి అప్పలరాజు వ్యవహార శైలిపై ఫిర్యాధులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక మంత్రిగారు తల పట్టుకుంటున్నారట.
మంత్రి అప్పలరాజుపై సొంతపార్టీ నేతలే ఇంతగా అసమ్మతి వెళ్లగక్కటానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కంబిరిగాం భూముల వ్యవహారంలో మంత్రి చేతివాటం, అనవసర జోక్యంతో అక్కడి ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారమే అప్పలరాజుకు ఎన్నికల సమయంలో అన్నీతానై నడిపించిన హేంబాబు చౌదరి ఆగ్రహానికి కారణమయ్యిందట. ఇక పలాస పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దువ్వాడ శ్రీకాంత్ కు మొదట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారు. కానీ ఎన్నికల తర్వాత పదవి ఇవ్వకపోవటంతో శ్రీకాంత్ ఇపుడు మంత్రి తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ ఇరువురు నేతలూ ఇపుడు మంత్రి అప్పలరాజుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ అసమ్మతి నేతల సమావేశాలు నిర్వహిస్తూ మంత్రి తీరుపై వ్యతిరేకతను కూడగడుతున్నారట.
పలాస నియోజకవర్గంలో ప్రతిపక్షాల కంటే స్వపక్షంలో విపక్ష నేతలతోనే మంత్రికి టెన్షన్ ఎక్కువ అయిపోతోందట. నియోజకవర్గ అధికారపార్టీలో ఇంత గందరగోళం ఉన్నప్పటికీ జిల్లా పెద్దలు కానీ పార్టీ హైకమాండ్ గానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టడం లేదు. దీంతో ఇక మంత్రితో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేశారట అసమ్మతి నేతలు. చూడాలి మరి మంత్రి వర్సెస్ ద్వితీయశ్రేణి నేతల ఎపిసోడ్ ఎక్కడికి దారి తీయనుందో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com