Editorial: "మంత్రి బొత్సను సైతం ఢీకొట్టేందుకు సిద్ధమైన మేనల్లుడు..?"

Editorial: మంత్రి బొత్సను సైతం ఢీకొట్టేందుకు సిద్ధమైన మేనల్లుడు..?
బొత్స నియోజకవర్గంలో అలజడులు; వైసీపీ పుట్టి ముంచేలా పరిస్థితులు; ఎంపీని డమ్మీ చేస్తున్న జడ్పీ; టిక్కెట్ లక్ష్యంగా కోల్డ్ వార్; మేనమామనైనా ఢీ కొట్టేందుకు సిద్ధం?

విజయనగరం జిల్లాలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్. సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎంపీగా ఎదిగిన నేత. బెల్లాన చంద్రశేఖర్ సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. చీపురుపల్లిలో బలమైన కాపు సామాజిక వర్గ నేతగా ఉన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పేరున్న నాయకుడు. ముఖ్యంగా యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి 3సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టడంలో బెల్లాన పాత్ర కీలకమని చెబుతుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న బెల్లాన పరిస్థితి గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం చందంగా మారిపోయిందట. నిన్నమొన్నటి వరకూ ఇక్కడ తిరుగులేని నేతగా చాలామణిలో ఉన్న బెల్లాన.. ఇప్పుడు సొంత పార్టీలోనే నామమాత్రుడిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందట. ఈ పరిస్థితికి కారణం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీనే అని పార్టీలో టాక్.

మంత్రి బొత్సకు స్వయాన మేనల్లుడైన చిన్నశ్రీను... బెల్లాన టార్గెట్గా చీపురుపల్లి రాజకీయాల్లో వేలిపెట్టింది లగాయత్తు చంద్రశేఖర్ కి రాజకీయ గ్రహణం పట్టిందని శ్రేణులు చెబుతుంటాయి. దశల వారీగా పార్టీలో బెల్లాన ప్రాబల్యాన్ని బలహీన పరుస్తూ వచ్చిన చిన్నశ్రీను... తన స్థానాన్ని సుస్థిరపరుచుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాడట. బెల్లానకి మిగిలిన కొద్దిపాటి క్యాడర్ ని కూడా తన వైపు తిప్పుకుని ఇటు పార్టీలోనూ, అటు అధికారుల వద్ద కనీస గౌరవం లేకుండా చేశారట. ఏకు మేకైనా విధంగా ఇక్కడ పాతుకుపోయిన చిన్న శ్రీనుని ఎదిరించే ధైర్యం లేక, కనీసం ఆ సాహసం చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారట బెల్లాన అనుచరులు.

చీపురుపల్లిలో చిన్నశ్రీను పెత్తనం ఏ స్థాయికి చేరిందంటే... ఎంపీ బెల్లాన స్థానికంగా అందుబాటులో ఉంటున్న రోజుల్లో కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవముల వంటి అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందని సందర్భాలు అనేకం ఉన్నాయట. చివరకు అధికారిక సమీక్ష సమావేశాలకు కూడా బెల్లానకు పిలుపు లేకపోవడం, చిన్నశ్రీను అన్నీ తానై ఏకపక్షంగా వ్యవహరించడం కామన్ అయిపోయిందట. స్థానికంగా విమర్శలు రేగుతున్నప్పటికీ ఎదురుచెప్పే సాహసం చేయలేక బెల్లాన క్యాడర్ మిన్నకుండిపోతోందట. అంతా చూసిన జనం బెల్లాన చంద్రశేఖర్ డమ్మీ అయిపోయారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట.

చివరకు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడి పరిస్థితిపై ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరిలో ఎవరు తనకు కావాలో అన్నది తేల్చుకోలేని సందిగ్ధంలో ఆయన ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో చిన్న శ్రీనుకి, మంత్రి బొత్సకి కూడా ఈ నియోజకవర్గములో రెండుమూడేళ్ళుగా కోల్డ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో బొత్స ఆశీస్సులు బెల్లానకే ఉండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే పార్టీ అధినేత వద్ద చిన్న శ్రీనుకి పలుకుబడి ఉండటంతో ఇప్పటికైతే ఆయనదే పైచేయంట. సొంత నియోజకవర్గాన్ని మరింత పటిష్ట పరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా మంత్రి బొత్స.. పెదబాబు, చిన్న శ్రీనుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంపై ఏ విధంగా స్పందించబోతున్నారన్నది ప్రస్తుతానికి అంతుబట్టడం లేదు.

ఇదే అదునుగా చిన్నశ్రీను మరింత దూకుడు పెంచి చీపురుపల్లి నియోజకవర్గాన్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పథక రచన ముమ్మరం చేస్తున్నారట. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎలాగైనా గెలవాలని ప్లాన్ వేశారట. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అధినేతను ప్రసన్నం చేసుకుని అమాత్య పదవిని అధిరోహించాలనే కలను నెరవేర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. చీపురుపల్లి టిక్కెట్ విషయంలో అవసరమైతే మంత్రి బొత్సని కూడా ఢీకొనే యోచనలో చిన్న శ్రీను ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక్కడ ఇంత జరుగుతున్నా, వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతున్నా... రేపోమాపో పార్టీ పంక్చర్ అయ్యే హెచ్చరికలు కనిపిస్తున్నా అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

కీలక నాయకుల మధ్య కోల్డ్ వార్ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలైందట. ఇదే సమయంలో తెలుగుదేశం కూడా ఇక్కడి రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలుపే లక్ష్యంగా చాప కింద నీరులా పావులు కదుపుతోందట. గతంతో పోల్చితే బలాన్ని గణనీయంగా పెంచుకున్న తెలుగు తమ్ముళ్లు విజయబావుట ఎగరవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. ఏదేమైనా బెల్లాన, చిన్నశ్రీను.. మధ్యలో బొత్సగా జరుగుతున్న రాజకీయం ఎన్నికల నాటికి మరింత రంజుగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో గెలిచేదెవరో?. ఈ వైకుంఠ పాలీలో నిచ్చెన ఎక్కేదెవరో? పాతాళానికి పడిపోయేదెవరో? అన్నది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story