Editorial: " పెందుర్తి ఎమ్మెల్యే అధీప్ రాజ్ కు టిక్కెట్ డౌటేనా?"

Editorial:  పెందుర్తి ఎమ్మెల్యే అధీప్ రాజ్ కు టిక్కెట్ డౌటేనా?
పెందుర్తి వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు; ఎమ్మెల్యే అధీప్ రాజ్ ఒంటెద్దు పోకడలు; సొంతపార్టీలోనే సిట్టింగ్ పై వ్యతిరేకతలు; నిరసనగా పదవులకు నేతల రాజీనామాలు; టిక్కెట్ రానివ్వకుండా అసంతృప్తుల పావులు



పెందుర్తి నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సగం సిటీ నేపథ్యం.. మరికొంత గ్రామీణ ప్రాంతాలు.. కలబోతే పెందుర్తి నియోజకవర్గం. జిల్లాల విభజన తర్వాత కూడా సగం నియోజకవర్గం విశాఖ జిల్లాలోనూ మిగతా, సగం అనకాపల్లి జిల్లాలోనూ విభజించారు. చిత్ర విచిత్ర పరిస్థితులున్న పెందుర్తిలో వైసీపీ రాజకీయాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్ గా పేరున్న బండారు సత్యనారాయణ మూర్తిపై... జగన్ హవాలో గెలిచిన అధీప్ రాజ్ తనదైన శైలితో హవా తగ్గించుకుంటున్నారన్న గుసగుసలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి.



పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధీప్ రాజ్ ను నియోజకవర్గ ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన వైసీపీ నేతలను సైతం ఎమ్మెల్యే పక్కనబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అధీప్ రాజ్ తన సొంత మనుష్యులకు మండలాలను అప్పగించి, తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న కారణంతో నియోజకవర్గంలో భగ్గుమంటున్నారు. ఈ విషయంపై అనేకసార్లు వైసీపీ నేతలు అధిష్టానంకు ఫిర్యాదు చెయ్యడం, అధీప్ కు అధిష్ఠానం అక్షింతలు వేయడం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేలో మాత్రం మార్పు రాలేదన్నది సెగ్మెంట్ లో ఓపెన్ సీక్రెట్.


ప్రాధాన్యత దక్కడం లేదంటూ సొంత నేతలే ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో ఉద్యోగాలు మరో చిచ్చుపెట్టాయి. NTPC, ఫార్మాసిటీ, హిందుజా కంపెనీల్లో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసిన వారికి ప్రాధ్యాన్యత ఇవ్వలేదని నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యే అధీప్ పై అలకబూనారు. అయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీంతో పరవాడ మండల వైసీపీ అధ్యక్షుడు బొద్ధపు చిన్నారావు, పెందుర్తి నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ పైలా హరీష్ లు తమ పదవులకు రాజీనామా చేసారు. ఇలా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు సరగడం చిన అప్పలనాయుడయితే ఎమ్మెల్యే అధీప్ రాజ్ పై డైరెక్ట్ యుద్ధం ప్రకటించారు. గడపగడప కార్యక్రమంలో తన అనుచరులతో ఎక్కడికక్కడ నిలదీయించడంతో ఎమ్మెల్యే ఓ సందర్భంలో ఇంటికే పరిమితమైన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అధీప్ కు టికెట్ రాకుండా చేసే చర్యల్లో సరగడం చిన అప్పలనాయుడు ఉన్నారు.


ఇక ఎమ్మెల్యే అధీప్ రాజ్ పై నియోజకవర్గ ప్రజలూ గుర్రుగా ఉన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానన్న హామీతో ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టి... పవర్ వచ్చాక పట్టించుకోకపోవడం పంచగ్రామాల్లో నివశిస్తున్న వేలాదిమంది బాధితులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. దీంతో పాటు నియోజకవర్గాల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని ఎమ్మెల్యేగా అధీప్ రాజ్ పై ముద్ర పడింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవలన్న ఆలోచనతో భూములపై ఎక్కువుగా దృష్టి పెట్టారని సొంత పార్టీలోనే టాక్ విన్పిస్తోంది. వీటన్నిటి కారణంతోనే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో టిక్కెట్ రాని మొదటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధిప్ ఉండబోతున్నారని చర్చించుకుంటున్నారు.

Tags

Next Story