Editorial: "శ్రీశైలం మల్లన్న ఆలయంలో రాయలసీమ మార్క్ రాజకీయాలు..?"

Editorial: శ్రీశైలం మల్లన్న ఆలయంలో రాయలసీమ మార్క్ రాజకీయాలు..?
శ్రీశైలం ఆలయంలో తరచూ వివాదాలు; ఈవో లవన్న, ఛైర్మన్ చక్రపాణి మధ్య విభేదాలు; రాజకీయాల మధ్య బలవుతున్న భక్తులు; తీవ్రస్థాయిలో మండిపడుతున్న హిందూ సంఘాలు

నిత్యం శివనామస్మరణతో మార్మోగే శ్రీశైల మహా క్షేత్రంలో రాజకీయ వివాదాలు క్రమంగా తిష్ట వేస్తున్నాయి. ఒక వివాదం మరువకముందే మరొకటి పుట్టుకొస్తోంది. దీంతో శ్రీశైలం మహా క్షేత్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న వివాదాలు ఇటు రాజకీయ వర్గాల్లో, అటు దేవాదాయ శాఖలో సెగలు పుట్టిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవోగా లవన్న.. ఆలయ పాలకమండలి ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి కొనసాగుతున్నారు. లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును కాంట్రాక్టర్ అధిక రేట్లకు విక్రయించి దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని పాలక మండలి ఛైర్మన్ చక్రపాణి రెడ్డి ఆరోపించారు. వీటికి ఆలయ ఈవో లవన్న వివరణ ఇచ్చారు. ఈవోపై చక్రపాణిరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

ఇలా పాలక మండలి ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో లవన్న మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. పంచాయతీ కాస్త వైసీపీ పెద్దల దాకా చేరిందని శ్రీశైలంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పాలక మండలిలోని ఓ సభ్యురాలు ఆలయంలో పనిచేసే ఉద్యోగితో దర్శనాల దందాపై మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. ఇక రాజకీయ వివాదాల విషయానికొస్తే... రాష్ట్రపతి పర్యటన రోజు మంత్రి రోజా శ్రీశైల దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో ఆమెను పోలీసులు లోపలికి పంపలేదు. దీంతో రోజా తీవ్ర మనస్థాపానికి గురై ఈ విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. అంతకుముందు కూడా మంత్రి రోజా మల్లన్న దర్శనానికి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం పాలకమండలి ఛైర్మన్, ఆలయ ఈవో మంత్రి రోజాకు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలకాలి. కానీ చక్రపాణి రెడ్డి ఆహ్వానం పలకలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఇందుకు కారణమని రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరిగింది.

ఇలా ఒకదాని తర్వాత మరొకటి వివాదాలు శ్రీశైలం ఆలయాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ పర్యటన సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఈ సమయంలో ఆలయ ఈవో లవన్న.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళ మీద పడి వంగి వంగి దండాలు పెట్టాడు. పెద్దిరెడ్డి పై తనకున్న స్వామి భక్తిని ఓపెన్ గా చాటుకున్నాడు. ఆలయ ఈవో.. శివ మాలలో ఉండి మంత్రి కాళ్లు మొక్కడం ఏంటని హిందూ సంఘాలు, మల్లన్న భక్తులు మండిపడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డిది నాది ఒకే ఊరు. ఆయన నాకు గురుస్వామి.. మా గురువుకు పాదాభివందనం చేస్తే తప్పేంటని ఆలయ ఈవో లవన్న మీడియా ముందు సనర్ధించుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈవో లవన్న తీరుపై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.

ఇటు దేవస్థానం అధికారుల తీరుపైనా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వర్గం అసంతృప్తిలో ఉందట. mla లోకల్ అయినప్పటికీ శ్రీశైలంలో ఆయన వర్గంకి ఏ పనులూ కావడం లేదట. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయానికి వస్తే.. ఆలయ కీలక అధికారి ఆయిన ఈవో, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ఇద్దరూ చిత్తూరు జిల్లావారు కావడమేనట. లోకల్ గా వైసీపీ లీడర్లు ఏం మాట్లాడినా డైరెక్ట్ మంత్రి పెద్దిరెడ్డి పేరే బయటికి వినిపిస్తోందట. ఇక ఈవో విషయానికి వస్తే మొదట సీఎం జగన్ స్వయంగా నియమించిన మనిషి. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి మద్దతు పుష్కలంగా ఉన్న అధికారి. అందుకే ఈవోను టచ్ చేయడానికి లోకల్ వైసీపీ లీడర్లు బెంబేలెత్తుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇటీవలే అధికారపార్టీకి చెందిన ఏడుగురు నేతలు లోకల్ mla సహకారంతో శ్రీశైలం దర్శనానికి వెళ్లారట. అయితే ఏడు మందిలో నలుగురికి అలంకార దర్శనం మాత్రమే జరిగితే.. మరో ముగ్గురికి ఆలయంలో పనిచేసే ఓ చిరు ఉద్యోగి ఏకంగా స్పర్శ దర్శనాలు చేయించారట. అంటే శ్రీశైలం ఆలయంలో లోకల్ mla మాటకంటే దేవాలయంలో పనిచేసే చిన్నపాటి ఉద్యోగులే మేలని.. వాళ్ళు పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారట. ఈ విషయం బాగా వైరల్ కావడంతో దేవస్థానం అధికారులు mla ఆగ్రహానికి గురి కాకుండా.. స్పర్శ దర్శనాలు చేపించిన ఆ ఉద్యోగిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు తీవ్ర చర్చ సాగుతోంది. ఇది mla శిల్పా వర్గాన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందట.

ఇటీవలే బ్రహ్మోత్సవాల సమయంలో దేవస్థానం అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు.. పాదయాత్రగా వచ్చే భక్తులకు.. వెంకటాపురం నుంచి భీముని కొలను వరకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. తాగునీరు, ఆహారం, వసతి, మెడిసిన్ అన్నీ దాతలే అందించారు. అడవిలో అతికష్టం మీద నడుచుకుంటూ వచ్చిన భక్తులను ఎక్కువ సేపు క్యూ లైన్లలో నిల్చో బెట్టకుండా కనీసం త్వరగా దర్శనాలు కల్పించలేక పోయారు. vipలు అయితే బారీకేడ్లు దూకేశారు. పోలీసులు, దేవస్థానం అధికారుల మధ్య సమన్వయలోపం కొరవడింది. భక్తుల కష్టాలను, ఇబ్బందులను వెలుగులోకి తెస్తున్నారని ఏకంగా మీడియాను పండుగరోజు రాత్రి ఆలయంలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు.

అయితే గతేడాది ఉగాది ఉత్సవాలు శ్రీశైలంలో విధ్వంసానికి దారి తీశాయి. లా అండ్ ఆర్డర్ గాడి తప్పి చిన్న గొడవ పెద్దగా మారి కన్నడ భక్తులు షాపులు తగుల బెట్టేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఉగాది ఉత్సవాలు రానున్నాయి. మరి ఇన్ని వివాదాల్లో ఉన్న దేవస్థానం అధికారులు భక్తులకు ఈ సారైనా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story