Editorial: "విశాఖ వైసీపీలో ఎమ్మెల్సీ చిచ్చు.. ఎన్నికల నాటికి అదేనా జరిగేది..?"

Editorial: విశాఖ వైసీపీలో ఎమ్మెల్సీ చిచ్చు.. ఎన్నికల నాటికి అదేనా జరిగేది..?
వైసీపీని షేక్ చేస్తున్న ఎమ్మెల్సీ రగడ; ఉమ్మడి విశాఖ జిల్లాలో పదవుల ప్రకంపనలు; ఆశావహులకు జగన్ ఊహించని షాక్; అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు; అధిష్టానానికి టైం చూసి షాక్ ఇవ్వబోతున్నారా?

ఉమ్మడి విశాఖలో ఈసారి ఇద్దరిని ఎమ్మెల్సీ పదవి వరించింది. విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన కోలా గురువులు, అరకు లోయకు చెందిన కుంభా రవిబాబుల పేర్లను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. 2019 సాధారణ ఎన్నికల్లో ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. కోలా గురువులు సౌత్ నియోజకవర్గంలో టికెట్ ఆశించగా... ద్రోణంరాజు శ్రీనివాస్ కి కేటాయించారు. కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా ఫాల్గుణకు కేటాయించారు. అపుడు ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వని అధిష్టానం ఇద్దరికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళ తర్వాత ఇద్దరికీ ఎమ్మెల్సీ ఇచ్చింది.

ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ పదవులు ఆశించిన వైసీపీ నేతల లిస్ట్ చాంతాడం ఉంది. టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్.ఏ రెహమాన్, తైనాల విజయ్ కుమార్ లు ఎమ్మెల్సీ ఆశించిన లిస్ట్ లో వున్నారు. ఇద్దరిలో ఒకరు విశాఖ సౌత్ సెగ్మెంట్ కి చెందినవారు కాగా, మరొకరది నార్త్ నియోజకవర్గం. ఈ టర్మ్ లో తప్పనిసరిగా ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన వారిలో విశాఖ వెస్ట్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్ వున్నారు. దాని కోసమే వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని త్యాగం చేసి వచ్చే ఎన్నికల కోసం ఆడారి ఆనంద్ కుమార్ కి మార్గం సుగమం చేశారు.

ఇక గాజువాక నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్యలు ఎమ్మెల్సీ పదవి ఆశించిన వారిలో ఉన్నారు. ఇక అనకాపల్లి జిల్లా విషయoకు వస్తే ఇక్కడా కూడా ఎమ్మెల్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు, దాని కోసం మంత్రుల ద్వారా పైరవీలు చేసిన వారున్నారు. వీరిలో నర్సీపట్నం నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, RECS మాజీ ఛైర్మన్ బొడ్డెటి ప్రసాద్ లు ఈసారి ఖాయం అనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అనుంగుడైన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశీస్సులతో బొడ్డెటి ప్రసాద్ కు పక్కాగా ఎమ్మెల్సీ వస్తుందనుకున్నారు.

ఎమ్మెల్సీ ఆశించిన వారి సంఖ్య పదికి పైమాటే.. కాని ఇచ్చింది ఇద్దరికి. అటు ఎమ్మెల్యే టికెట్ పై హామీ లేక, ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేరకపోవడంతో ఆశావాహుల్లో అసంతృప్తి సెగలు పెల్లుబికుతున్నాయి. ఆ ప్రభావం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపుపై ఉంటుందన్న గుసగుసలు అధికార పార్టీలో గట్టిగా వినిపిస్తున్నాయి. అంతే గాకుండా ఇపుడు ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ వారి ఎఫెక్ట్ సాధారణ ఎన్నికల్లోనూ ఉంటుందన్న గుబులు వైసీపీ అధిష్టానంలో నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story