Election Campaign: వేగం పుంజుకుంటున్న ప్రచార హోరు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.
కృష్ణా జిల్లా మాచవరంలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి, తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము రోడ్ షో చేపట్టి పింఛన్ 4వేలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ 7వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పామర్రులో తెదేపా అభ్యర్థి కుమార్ రాజా సతీమణి ఎన్నికల ప్రచారం చేశారు. చల్లపల్లిలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు టీ దుకాణం వద్ద టీ కలిపి ప్రజలకు అందించారు. పర్చూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. చిలకలూరిపేటలో ముస్లిం మైనార్టీలతో తెదేపా అభ్యర్తి ప్రత్తిపాటి పుల్లారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముస్లింలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రత్తిపాటి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించి.. వైకాపా రాక్షస పాలన అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్ కలిసి ప్రచారం చేశారు. వైకాపాకు చెందిన వంద కుటుంబాలు... నరసన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి . పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు ఇంటింటా ప్రచారం నిర్వహించి... మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించి.. కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరం 15, 49వ డివిజన్‌లో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. పార్వతీపురంలో తెదేపా అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే... ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారుకాకినాడలోని 14, 15వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా.. సినీ నటి కుష్బూ అరకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com