TS POLLS: ప్రచార హోరు.. పార్టీల జోరు

TS POLLS: ప్రచార హోరు.. పార్టీల జోరు
తెలంగాణలో ముమ్మరంగా ప్రచారం.... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ప్రయత్నాలు...

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతకా స్థాయికి చేరింది. అన్ని పార్టీలు కదన కుతుహలంతో దూకుడు పెంచాయి. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అంటూ బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేసీఆర్‌ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ఆరు గ్యారెంటీలతో జనాన్ని ఆకట్టుకుట్టుకునేలా కాంగ్రెస్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. బీజేపీ, మజ్లిస్‌, బీఎస్పీ, వామపక్షాలు ప్రచారపర్వంలో ఉనికి చాటుతున్నాయి. కేసీఆర్‌ బహిరంగసభలు, అభ్యర్థుల సుడిగాలి పర్యటనలతో తెలంగాణవ్యాప్తంగా గులాబీదళం ప్రచారాలు హోరెత్తిస్తోంది. రెండ్నెళ్ల క్రితమే అభ్యర్థుల ఖరారుతో అందరికంటే ముందుగానే రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వరుసగా ఊళ్లను చుట్టేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అధికార పార్టీ... హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. నేడు భైంసా, ఆర్మూర్‌, కోరుట్లలో జరిగే ప్రజాఆశీర్వాద సభలకు భారాస నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తూకారంగేట్, ఇందిరాలక్ష్మీనగర్, వెంకట్‌నగర్ ప్రాంతాల్లో ఉపసభాపతి పద్మారావు ఎన్నికల ప్రచారం చేశారు. కంటోన్మెంట్‌ భారాస ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి తలసాని.... దివంగత నేత సాయన్న కుమార్తె లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌షాకోట్ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి MLA ప్రకాశ్‌గౌడ్‌ సమక్షంలో భారాసలో చేరారు. తనపై ఐటీ దాడుల వెనుక మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉందన్న బడంగ్‌పేట మేయర్‌ పారిజాత వ్యాఖ్యలను మహేశ్వరం భారాస నేతలు తిప్పికొట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రోడ్‌షో నిర్వహించారు.

కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై తిరగబడదాం-తరిమికొడదాం నినాదంతో కాంగ్రెస్‌ నేతలు గళమెత్తుతున్నారు. గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ-పరీక్ష రద్దు సహా నిరుద్యోగం అంశాన్ని బలమైన అంశంగా మలుచుకుని చెయ్యి పార్టీ ప్రచారం చేస్తోంది. తాము గద్దెనెక్కగానే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని... నిరుద్యోగుల్ని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలు, ప్రజాకర్షక హామీలతో ఎన్నికల గోదాలోకి దిగింది. సెప్టెంబరు 17న తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నం చేస్తున్నారు. యువ, రైతు, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్లను ఇప్పటికే ప్రకటించారు. మేనిఫెస్టోలో మరిన్ని జనార్షక హామీలను పొందు పర్చే ఉద్దేశంతో శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్యనాయకులు, అభ్యర్థులు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలుపైనే ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతుండగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడంతో... క్షేత్రస్థాయిలో కాషాయదళం సందడి ఇంకా పెరగలేదు. అడపాదడపా అగ్రనేతల నేతలతో సభలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పట్టున్న మజ్లిస్‌ ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. బహుజన రాజ్యం పేరిట మాజీ IPS అధికారి RS ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని BSP విస్తృత ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణంతోపాటు.. యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని ఆ పార్టీ జనంలోకి వెళ్తోంది. వామపక్షాలు ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి

Next Story