ఏలూరులో వింత వ్యాధి.. 600కు చేరిన బాధితుల సంఖ్య

ఏలూరులో వింత వ్యాధి.. 600కు చేరిన బాధితుల సంఖ్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అధికారిక లెక్కల ప్రకారం బాధితుల సంఖ్య 600కు చేరింది.. గురువారం కొత్తగా తొమ్మది కేసులు నమోదయ్యాయి.. దీంతో ఏలూరులో ఎటు చూసినా భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య బాగా తగ్గినా.. నీళ్ల వల్లే ముప్పు అని తెలిసి మిగతా ప్రాంతాల్లో జనం కూడా జాగ్రత్తపడుతున్నారు. 80 మంది మినహా అంతా డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 46 మంది, విజయవాడ-గుంటూరులో 33 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు వింత వ్యాధి బాధితుల్లో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు మూడుకు చేరాయి. అయితే, విజయవాడలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోవడానికి వింత వ్యాధి కారణం కాదని వైద్యాధికారులు చెప్తున్నారు. కరోనాతో ఒకరు, ఊపిరితిత్తుల వ్యాధితో ఒకరు మరణించారని వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో 25 మందికి చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శివశంకర్‌ చెప్తున్నారు. కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశామని, మిగతావారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

ఓ వైపు వింత రోగంతో జనం అల్లాడుతుంటే.. అధికారులు బాధితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అస్వస్థతకు గురైనవారికి కాలం చెల్లిన మందులు, ట్యాబెట్ల పంపిణీ చేస్తున్నారంటూ జనసేన డాక్టర్ల బృందం ఆరోపించింది. దక్షిణపు వీధిలోని గాంధీ బొమ్మ సెంటర్‌ మెడికల్ క్యాంప్‌లో.. రోగులకు కాలం చెల్లిన మందులు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టులో కాలపరిమితి ముగిసిన యాంటీ అలర్జీ మందుల్ని.. మెడికల్ క్యాంప్‌ సిబ్బంది స్థానికులకు ఇస్తున్నారంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు మొత్తం ICUలో ఉంటే ఇలాంటి మందులతో.. ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కాలం చెల్లిన మందులు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటిపై అధికారులు దృష్టి సారించారు. ఏలూరు సిటీ, దెందులూరు, పెదపాడు మండలాల్లో కృష్ణా కాల్వ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. దెందులూరు మండలంలోని కొన్ని గ్రామాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం ప్రాంతాల్లో 80 గ్రామాల్లో తాగునీటికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పరీక్షలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story