ఏలూరులో వింతవ్యాధి.. వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్!

ఏలూరులో వింతవ్యాధి.. వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్!

ఏలూరు వింతవ్యాధికి కారణాలు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి. సీసం, నికెల్ లోహాలు ఓ కారణమని ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇప్పుడు మరో విషయం బయటపడింది. ఆర్గానో క్లోరిన్ అవశేషాలు కూడా వింతవ్యాధికి కారణం అని తెలుస్తోందంటున్నారు వైద్యులు. పురుగుమందుల్లో ఈ ఆర్గానో క్లోరిన్‌ ఉంటుంది. ఇది సీసం, నికెల్‌తో కలవడం వల్ల మూర్ఛ, తలనొప్పి, వికారం వంటి లక్షణాలు తలెత్తాయని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అయితే, బాధితుల శరీరాల్లోకి ఇది ఎలా వచ్చి చేరిందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీసం, నికెల్ కూడా శరీరంలోకి ఎలా చేరిందనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది.

సీసం, నికెల్, ఆర్గానో క్లోరిన్.. ఇవి మనిషి శరీరంలోకి చేరడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారం, పాలు, నీళ్లే. బ్యాటరీల రీసైక్లింగ్‌లో భాగంగా సీసం నేలలో చేరి ఉండొచ్చని, కూరగాయలు ధాన్యం ద్వారా ఈ భార లోహాలు శరీరంలోకి వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక క్రిమిసంహార మందుల్లో ఉండే ఆర్గానో క్లోరిన్ కూడా తినే ఆహారం ద్వారానే శరీరంలోకి చేరుతుంది. లేదంటే గడ్డిపై పురుగు మందులు పడినప్పుడు.. దాన్ని పశువులు తిన్నప్పుడు.. అవి ఇచ్చే పాల ద్వారా కూడా ఆర్గానో క్లోరిన్‌ శరీరంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ అవశేషాలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది నిర్ధారణ అయితే.. అంతుచిక్కని వ్యాధి మూలాలు తెలిసినట్లేనని చెబుతున్నారు. ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆర్గానో క్లోరిన్‌ శరీరంలోకి వెళితే మూర్ఛ, తలనొప్పి, తల తిరుగుతుండటం, వాంతులు, వికారం, అవయవాలు కొట్టుకోవడం, వణకడం, తికమకగా వ్యవహరిస్తుండటం, మాటలు తడబడటం, కండరాల బలహీనత, నోటి నుంచి చొంగ కారడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు బయటపడతాయి.

అంతేకాదు, లివర్, కిడ్నీలు, కేంద్ర నాడీ వ్యవస్థపై చాలా కాలం పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఏలూరు బాధితుల్లో ప్రాథమిక లక్షణాలు చాలావరకూ ఇలాగే ఉండటంతో ఆర్గానో క్లోరినే ప్రధాన కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా క్లోరిన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లుతున్నారు. వీటివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు.

ఏలూరులోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, నీరు, నూనె వంటి నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ పరీక్షిస్తోంది. వీటి ఫలితాలు రేపు వస్తాయి. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం పశువుల నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షించనుంది. ఇక బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ చేసిన పరీక్షల్లో తేలింది. ఐఐసీటీ పరీక్షల్లోనూ ఇదే విషయం బయటపడింది. మొత్తంమీద ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story