LOKESH: ఉపాధి కల్పన మా బ్రాండ్.. గొడ్డలి జగన్ బ్రాండ్

రాయలసీమ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ రంగానికి కొత్త దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉపాధి అవకాశాల విస్తరణతో పాటు పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పారిశ్రామిక అభివృద్ధి నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కడప జిల్లా టి.కోడూరు సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాయలసీమను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలపై భారం తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కేవలం 11 నెలల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేయడం వెనుక రైతుల త్యాగం, సహకారం ఎంతో కీలకమని లోకేశ్ అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జమ్మలమడుగు ప్రాంతం వైపు అందరి దృష్టి మళ్లిందని, ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ చెప్పారు. ఉపాధి సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అదే తమ రాజకీయ గుర్తింపుగా పేర్కొన్నారు. గత పాలనలో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని విమర్శించారు. అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వబోమని హామీ ఇచ్చారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా ప్రత్యేక ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ప్రాంతానికి ప్రముఖ సంస్థలు, పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని నిర్మించడం ఎంతో కష్టమని, దానిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. జమ్మలమడుగు ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని లోకేశ్ సందర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
