AP DGP: డీజీపీ గౌతం సవాంగ్ ఆకస్మిక బదిలీ వెనుక ఆంతర్యమేంటి..?

AP DGP: ఏపీలో డీజీపీ మార్పు నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. 2023 జులై వరకూ గౌతం సవాంగ్‌కు సర్వీస్ ఉన్నా అర్థాంతరంగా ఆయన్ను DGPగా తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడం వెనుక ఏం జరిగింది? CM జగన్ ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
డీజీపీగా తనను తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాక గౌతమ్ సవాంగ్ తాడేపల్లిలోని CM క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి ఇన్నాళ్లూ తనకు డీజీపీగా పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అటు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈనెల మొదటి వారంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ సక్సెస్ అవడానికి పోలీసుల వైఫల్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో గౌతం సవాంగ్‌పై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆశ్చర్యంగా చలో విజయవాడ జరిగి 2 వారాలు కూడా కాకముందే సవాంగ్‌పై వేటు వెయ్యడం చూస్తే.. సీఎ జగన్ దాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేదంటే ముందస్తు ఎన్నికల వ్యూహం లాంటిదేమైనా సీఎం మనసులో ఉందా అనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక సవాంగ్‌తో సత్సంబంధాలే ఉన్నాయి.ఆయన కూడా సమర్థమైన అధికారిగానే గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పుడు ఉన్నట్టుండి ట్రాన్స్‌ఫర్ చేయడం డిపార్ట్‌మెంట్‌లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది.
మాజీ డీజీపీ సవాంగ్‌ను సీఎం జగన్ కరివేపాకులా వాడుకొని తీసేశారని విమర్శించారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఐపీసీ రూల్స్ పక్కన పెట్టి మరీ జగన్ కోసం సవాంగ్ పనిచేశారని, గౌతమ్ సవాంగ్ విషయం అందరికీ గుణపాఠం కావాలన్నారాయన. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాష్, పీవీ రమేష్‌ను వాడుకొని విసిరిపడేశారని వర్ల ఆరోపించారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం విస్మయం కలిగించిందన్నారు. దీనిపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని లేకుంటే.. చలో విజయవాడ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందన్నారు పవన్
మొత్తానికి ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముందే కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులను బదిలీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. డిసెంబర్‌లో జగన్ ముందస్తుకు వెళ్తారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఏడాది ముందే పూర్తిస్థాయిలో ప్రజల్లో తిరగాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనే చర్చ నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com