సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు : చంద్రబాబు

దుర్గగుడి రథంలో సింహాలు ఎలా మాయమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. కొంతకాలంగా ఆలయాల్లో సంప్రదాయాల్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 80కి పైగా ఘటనలు జరిగాయని చంద్రబాబు అన్నారు. ఆలయాలపై దాడుల్ని ప్రభుత్వం మొదట్లోనే సీరియస్‌గా ఉంటే వరుస ఘటనలు జరిగేవి కావని చంద్రబాబు అన్నారు.
దుర్గమ్మ ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాలు చోరీకి గురవటం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. హిందూ దేవాలయాల్లోనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. దేవాలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తే బాగుంటుందని రఘురామ ప్రభుత్వానికి సూచించారు. దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైన ఘటనలో ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గుండు సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.. అధికారుల సహకారం లేకుండా సీసీ కెమెరాలు దాటి దొంగలు తప్పించుకోగలరా అని ప్రశ్నించారు. మత సామరస్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఫైరయ్యారు.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. దేవాలయాలపై దాడులు చేసిన వారి మీద చర్యలు తీసుకోకుండా భక్తులను ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఏపీలో ఉండే అర్హత లేదన్నారు. ఆలయాల్లో భద్రత మరింత పెంచామని ప్రభుత్వం చెబుతుండగా.. ఇలా వరుస సంఘటనలు వెలుగు చూస్తుండటంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.. వెండి సింహాలు మాయం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com