బీసీ నిధుల్లో వేల కోట్ల రూపాయలు కోత : టీడీపీ అధినేత చంద్రబాబు

బీసీ నిధుల్లో వేల కోట్ల రూపాయలు కోత : టీడీపీ అధినేత చంద్రబాబు
బీసీ నిధుల్లో వేల కోట్ల రూపాయలు కోత పెట్టి ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత 2 బడ్జెట్లలో బీసీలకు ఎన్ని నిధులు..

బీసీ నిధుల్లో వేల కోట్ల రూపాయలు కోత పెట్టి ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత 2 బడ్జెట్లలో బీసీలకు ఎన్ని నిధులు కేటాయించారు..? అందులో ఎంత కోత విధించారు, ఎన్ని దారిమళ్లించారు..? అని ప్రశ్నించారు. బీసీ కార్పోరేషన్లకు 17నెలల్లో ఎన్ని నిధులు ఇచ్చారు..?, ఎంతమందికి ఉపాధి కల్పించారు..? అని నిలదీశారు. వైసీపీ నేతలకు పోస్టులు కట్టబెట్టడం కోసం కార్పోరేషన్లను వాడుకోవడం హేయమని చంద్రబాబు మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని... పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోందని అన్నారు. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వ శాండ్ పాలసీని రద్దుచేసి... ఏం సాధించారని అన్నారు. ఇసుక మొత్తం హోల్ సేల్‌గా ఏ ఒక్కరికో ధారాదత్తం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజుకు ఎంత మద్యం అమ్మారు...?. ఎంత జే ట్యాక్స్ వసూలైంది..? అందులో స్థానిక వైసీపీ ట్యాక్స్ ఎంత అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. రోజువారీ డబ్బు సంచుల లెక్కల్లో వైసీపీ నాయకులు మునిగి తేలుతున్నారని ఆరోపించారు.

టీడీపీ హయాంలో రాష్ట్రం కళకళలాడిందని చంద్రబాబు అన్నారు. 13జిల్లాల్లో అభివృద్ది పనులతో నిత్యం కోలాహలం ఉండేదని వ్యాఖ్యానించారు. భారీ మెషీనరీ, వేలాది మంది కూలీలతో సందడిగా ఉండేదని తెలిపారు. పేదలకు ఇళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, పరిశ్రమలు, యువతకు ఉపాధి కోసం టీడీపీ హయాంలో చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయి... అంతా వెలవెల పోయే పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ హయాంలో అగ్రిటెక్ సదస్సు పెట్టి బిల్‌గేట్స్‌ను విశాఖకు రప్పించామని తెలిపారు. ఫిన్‌టెక్ సదస్సు, బ్లాక్ చెయిన్ కాన్ఫరెన్స్‌ విశాఖలోనే పెట్టామని చెప్పారు. విశాఖను అంతర్జాతీయ సదస్సులకు వేదికగా చేశామని... పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఒక్కటైనా అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారా...? అని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ అయినా విశాఖకు వచ్చిందా..? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఏమైనా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారా..? అని నిలదీశారు. విశాఖ నుంచి లులూను తరిమేశారన్న చంద్రబాబు.... ఫ్రాంక్టిన్ టెంపుల్ టన్‌ను వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. అంతా నాశనం చేసి... ఏపీకి చెడ్డపేరు తెచ్చారని నిప్పులు చెరిగారు.

విపత్తుల్లో వైసీపీ పత్తా లేకుండా పారిపోతోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు కరోనాలో, ఇటు వరుస వరద విపత్తుల్లో వైసీపీ పనితీరు బయటపడిందని అన్నారు. హుద్‌హుద్‌లో, తిత్లీ తుఫానుల సమయంలో టీడీపీ ఆదుకున్న తీరు, ఇప్పుడు వైసీపీ నిర్లక్ష్యంపై ప్రజలే చర్చిస్తున్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో వైసీపీ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడ్డ వారిని ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ గాని, పరిహారం గాని ఇవ్వలేదని విమర్శించారు.

పోలవరం పనులు నిలిపేయడం ఉత్తరాంధ్రపై వైసీపీ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోట అని... టీడీపీపై అక్కసుతోనే ఉత్తరాంధ్ర అభివృద్దికి వైసీపీ గండి కొడుతోందని అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే పోలవరం పనులు నిలిపేశారని..., విశాఖ, అనకాపల్లి ప్రజలకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు నిప్పులుచెరిగారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ఆపేశారని ధ్వజమెత్తారు. విశాఖ వాసులు... అభివృద్ధి, ఉపాధిని కోరుకుంటారే తప్ప... హింసా విధ్వంసాలను సహించరని మండిపడ్డారు. ప్రశాంత జీవనాన్ని దెబ్బతీసే చర్యలను హర్షించరు అని చెప్పారు. చట్ట ఉల్లంఘనలను అంగీకరించరని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల్లో వాటాల కోసం పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారని మండిపడ్డారు. కొత్త పెట్టుబడులు రాకుండా చేసి.. యువత ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story