వైసీపీ రాక్షసకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయింది : చంద్రబాబు
అరాచక , అనాగరిక పాలనకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ సిఎం కాగానే మొదట టిడిపి శ్రేణులపై దాడులకు తెగబడ్డారు.. తర్వాత దళితులపై దమనకాండకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బీసిలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు, తర్వాత దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం...ఇప్పుడు ముస్లిం మైనారిటీ కుటుంబాలపై పడ్డారని అన్నారు..ఇలా జగన్ పాలనలో ఎవరికీ రక్షణలేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.
వైసిపి రాక్షసకాండకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసిపి వచ్చాక రాష్ట్రాన్ని అగ్నిగుండంలోకి నెట్టారని... ఎక్కడ చూసినా హింసాత్మక, భయోత్పాత చర్యలు జరుగుతున్నాయన్నారు. విధ్వంసాలు-కూల్చివేతలు, దాడులు-దౌర్జన్యాలు..అత్యాచారాలు- అరాచకాలు, శిరోముండనాలు-సామూహిక ఆత్మహత్యలు జరుగుతున్నాయనంటూ విమర్శించారు. సుపరిపాలనకు టిడిపి నాంది పలికితే, ఆ పాలనను వైసిపి అటకెక్కించిందన్నారు. తెస్తానన్న ప్రత్యేక హోదా సాధించకపోగా వచ్చిన 15లక్షల కోట్ల పెట్టుబడులను పోగొట్టారన్నారు చంద్రబాబు. ఇటీవలె అమెజాన్ సంస్థ తెలంగాణకు వెళ్లిపోయిందని.. గత 17నెలల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే పొరుగు రాష్ట్రాలతో పోటీబడి పెట్టుబడులు సాధించేవాళ్లమని, యువతకు ఉద్యోగాలు కల్పించేవాళ్లమన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com