బరితెగించిన జగన్.. న్యాయ వ్యవస్థనే బెదిరించే స్థాయికి వెళ్లారు : మాజీ మంత్రి యనమల

జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. భస్మాసురుడిలా జగన్ రెడ్డి తన చెయ్యి తన నెత్తిపై పెట్టుకున్నాడన్నారు. శిక్షపడితే ఆరేళ్ల అనర్హత భయం జగన్‌ను వెన్నాడుతోందని.. పదేళ్ల శిక్ష పడితే 16 ఏళ్లు పోటీకి అనర్హుడు అవుతాడని యనమల అన్నారు. ఈ 31 కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయమన్న యనమల.. అందుకే తప్పుల మీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవాద సంఘాలన్నీ జగన్ దుర్బుద్ధిని, రహస్య అజెండా బయట పెట్టాయని పేర్కొన్నారు. జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఏపీ భవిష్యత్తుకే అవరోధాలుగా అభివర్ణించారు.
సీజేకు లేఖ ద్వారా జగన్ రెడ్డి సాధించింది ఏమిటని యనమల ప్రశ్నించారు. తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏపీని పాలిస్తున్నాడని దేశం విస్తుపోయేలా చేశారన్నారు. న్యాయ వ్యవస్థపై పగబట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామన్న యనమల... ప్రభుత్వాలను కోర్టులు అస్థిర పర్చడం ఎప్పుడైనా విన్నామా, కన్నామా..? అని ప్రశ్నించారు. తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న సీఎం దేశంలో ఉన్నాడా..? అన్నారు. ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్నవారు పరిపాలనకే తగరని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి బెదిరింపులు తార స్థాయికి చేరాయన్న యనమల... న్యాయ వ్యవస్థనే బెదిరించే స్థాయికి చేరడం జగన్ బరితెగింపు రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com