ARREST: కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్‌.. కాసేపట్లో కోర్టుకు

ARREST: కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్‌.. కాసేపట్లో కోర్టుకు
X
కేరళలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరిలో కాకాణిపై కేసు నమోదైంది. కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కాకాణిని నెల్లూరు తీసుకొచ్చే అవకాశముంది. వైసీపీ హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి బాలాజీనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు.. కాకాణి గోవర్దన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్‌ అధికారి పేర్కొన్నారు.. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ముందస్తు బెయిలు పిటిషన్‌తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిలు పిటిషన్‌ వేసినా ఎదురుదెబ్బే తగిలింది. దీంతో కాకాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు కోర్టుకు కాకాణి గోవర్ధన్‌

అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనను పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా కాకాణిని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే కాకాణిని నెల్లూరు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు.

కాకాణి అరెస్ట్ రాజకీయ కక్ష: మాజీ మంత్రి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అరెస్ట్‌‌పై వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. కాకాణి అరెస్ట్‌ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందన్నారు. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మేరుగ నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags

Next Story