తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విషయంపై నిర్ణయం తీసుకోని ఎగ్జిబిటర్స్

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విషయంపై నిర్ణయం తీసుకోని ఎగ్జిబిటర్స్
దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్‌ 5.0 నిబంధనలు అనుసరించి షోలు ప్రదర్శిస్తారు. ఐతే 15 రాష్ట్రాల్లో ధియేటర్లలో..

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్‌ 5.0 నిబంధనలు అనుసరించి షోలు ప్రదర్శిస్తారు. ఐతే 15 రాష్ట్రాల్లో ధియేటర్లలో మాత్రమే ప్రస్తుతం బొమ్మ పడబోతోంది. సగం శాతం సీట్ల టికెట్లు మాత్రమే విక్రయిస్తూ కోవిడ్ నిబంధనలు అనుసరించి షోలు వేస్తారు. అలాగే కామన్ ఏరియాలో ప్రేక్షకుల మధ్య కచ్చితంగా 6 అడుగుల దూరం ఉండే విషయంలోను జాగ్రత్తలు తీసుకోనున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్ లాంటి ఇతర జాగ్రత్తలు కూడా పాటిస్తూనే సినిమాలు ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ సినిమాల విషయంపై ఎగ్జిబిటర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

లాక్‌డౌన్ కాలానికి విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దానిపై స్పష్టత వచ్చే వరకూ హాళ్లు తెరవొద్దని భావిస్తున్నారు. నవంబర్ 1 నుంచి ధియేటర్లలో ఆట మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటికిప్పుడు ధియేటర్లు తెరిచినా కొత్త సినిమాల రిలీజ్‌లు ఏమీ లేనందున ప్రక్షకులు వస్తారా రారా అనే సందేహం ఉంది. అందుకే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాకే తిరిగి ప్రదర్శనలకు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడా కొత్త సినిమాల రిలీజ్‌లేమీ లేవు. ఐతే.. ఇవాళ్టి నుంచి ధియేటర్లు తెరుస్తున్నారు కాబట్టి కొన్ని సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. 'పీఎం నరేంద్రమోదీ, తానాజీ, తప్పడ్, వార్ లాంటి సినిమాలు ఇవాళ్టి నుంచి ధియేటర్లలో ప్లే చేస్తారు.

కరోనా విజృంభణతో లాక్‌డౌన్ ప్రకటించాక అన్నీ మూతపడ్డాయి. దాదాపు 7 నెలల తర్వాత ఇప్పుడు ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే మాల్స్, హోటల్స్‌కి వెళ్లడానికి నెమ్మదిగా అలవాటుపడ్డ జనం మల్టీప్లెక్స్‌లకు కూడా వెళ్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల తీవ్రత బాగా తగ్గిన నేపథ్యంలో.. దీపావళినాటికైనా సినిమా పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story