EXPORTS: ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలదే హవా

EXPORTS:  ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలదే హవా
X
ఎగుమతులు అధికంగా ఉంటే ఆదాయం మెరుగు... ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి నమోదు... ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్

ఏ రా­ష్ట్రం­లో­నై­నా ఎగు­మ­తు­లు అధి­కం­గా ఉం­టే­నే రా­ష్ట్ర ఆదా­యం మె­రు­గ­వు­తుం­ది. ఆర్థిక వ్య­వ­స్థ బల­ప­డు­తుం­ది. తా­జా­గా ఎగు­మ­తు­ల్లో తె­లు­గు రా­ష్ట్రా­లు భారీ వృ­ద్ధి­ని నమో­దు చే­స్తు­న్నా­యి. ప్ర­తి ఏటా ఎగు­మ­తు­లు పె­ర­గ­ట­మే కా­కుం­డా ఎగు­మ­తుల శ్రే­ణి వి­స్త­రి­స్తు­న్నా­యి. ఎన్నో ఏళ్లు­గా తె­లు­గు రా­ష్ట్రాల నుం­చి అధి­కం­గా ఎగు­మ­తి అవు­తు­న్న వస్తు­వుల జా­బి­తా­లో వ్య­వ­సాయ ఉత్ప­త్తు­లు ముం­దుం­టు­న్నా­యి. కానీ, ఇప్పు­డు పరి­స్థి­తి మా­రు­తోం­ది. ఇం­జి­నీ­రిం­గ్‌ ఉత్ప­త్తు­లు, ఔష­ధా­లు, రసా­య­నా­లు, ఎల­క్ట్రా­ని­క్స్‌ వంటి 'మ్యా­న్‌­ఫ్యా­క్చ­ర్డ్‌ గూ­డ్స్‌' ఎగు­మ­తు­లు బాగా పె­రు­గు­తు­న్నా­యి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు ఇంకా అధికంగా నమోదవుతాయని, అందుకు అవసరమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక ఎగుమతులు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. త్వరలో టాప్‌-5 జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్థానం సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రక్షణ, అంతరిక్ష పరిజ్ఞానం

ఎగుమతులను కొనసాగించి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. మనదేశంలో రక్షణ, అంతరిక్ష పరిజ్ఞానానికి తెలంగాణ వెనుదన్నుగా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం రక్షణ ఉత్పత్తులకు కీలకమైన కేంద్రంగా ఎదుగుతోంది. బీడీఎల్, మిధాని, డీఆర్‌డీఎల్‌ విభాగాలకు తోడు ప్రైవేటు రంగంలో ఎన్నో సంస్థలు కీలకమైన రక్షణ ఉత్పత్తులను భారత సైన్యానికి అందించటమే కాకుండా పెద్దఎత్తున ఎగుమతులు చేస్తున్నాయి. అలాగే స్పేస్‌టెక్‌ పరిశ్రమలు ఇక్కడ విస్తరిస్తున్నాయి.

పారిశ్రామిక వాడల్లో ఏర్పాటు

ఇంజినీరింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసే యూనిట్లు, కంపెనీలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో ఏర్పాటవుతున్నాయి. దీని వల్ల ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు గత కొన్నేళ్లలోనే ఎంతో అధికంగా పెరిగే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రోత్సాహకర విధానాలు, రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత కూడా ఎగుమతుల్లో వృద్ధికి వీలుకల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.

వ్యవసాయోత్పత్తుల కంటే మిన్నగా...

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రం నుంచి ధాన్యం, పొగాకు, కాఫీ, మిర్చి, పసుపు ఎగుమతులకు తోడు చేపలు, రొయ్యలు, రొయ్యల మేత అధికంగా ఎగుమతి అవుతున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్‌ వస్తువులు, రసాయనాలు, మందుల ఎగుమతులు పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో ఇంజినీరింగ్‌ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ఎగుమతులు ఇంకా బాగా పెరుగుతాయని, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఏపీలో వ్యవసాయ రంగంలోని ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. దీన్ని తగ్గించాలంటే పరిశ్రమలను ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించటమే మార్గం. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు, దీని ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags

Next Story