Fake Doctor : రోగులను మభ్యపెట్టి... పైసలు కొల్లగొట్టి... చివరికి

విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో పలువురు రోగుల వద్ద మోసపూరితంగా డబ్బులు గుంజిన నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విజయనగరంలోని పూసపట్టిరేగ మండలంలోని రెల్లివలసకు చెందిన డి.జయరామ్(26)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్మీడియేట్ వరకూ మాత్రమే చదువుకున్న జయరామ్ విశాఖపట్నంలోనూ, బెంగళూరులోనూ కొన్ని రోజులు పాటూ పలు ఆసుపత్రుల్లో హెల్పర్ గా పనిచేశాడు. అయితే అక్కడ వస్తోన్న ఆదాయం సరిపోవడం లేదని భావించిన జయరామ్ విజయవాడకు వచ్చి ఓ హోటల్ లో అద్దెకు దిగాడు. మార్చి 6న ఆంధ్ర ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగానికి వెళ్లిన జయరామ్ అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న రోగితో మాటలు కలిపాడు. అతడి కేసు షీట్ తీసుకుని తానే అతడికి వైద్యం చేయబోతున్నట్లు వెల్లడించాడు. కాసేపు సరదాగా మాట్లాడిన తరువాత తన వాలెట్ ను ఆపరేషన్ థియేటర్ లో మరచిపోయినట్లు చెప్పి రోగి వద్ద నుంచి రూ.7,500 తన అకౌంట్ కు బదిలీ చేయించుకున్నాడు. చికిత్స ఖర్చుల్లో వాటిని సర్దుబాటు చేస్తానని నమ్మించి సైలెంట్ గా ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత గుంటూరుకు వెళ్లిన జయరామ్ అక్కడ పలు ఆసుపత్రుల్లో ఇదే విధంగా కొంత మంది రోగులను బురిడీ కొట్టించాడు. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సూర్యాపేట పోలీసులు సీసీటీవీ ఫుజేటీ, డబ్బులు ట్రాన్ఫర్ చేసేందుకు ఉపయోగించిన సెల్ నంబర్ ఆధారంగా విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద జయరామ్ ను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com