CBN: ధాన్యం గింజలతో చంద్రబాబు చిత్రం

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటాన్ని రూపొందించారు. దీనిని పలువురు మంత్రులు తిలకించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా మారారని, అందుకు నిదర్శనమే ఆయన ఇటీవల రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలు అని మంత్రులు కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవి, గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనియాడారు.
ఆమె సహకారం, ఆప్యాయత వల్లే
ఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేశారు. ‘‘జీవితంలో మరో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. ఎప్పటికీ అండగా నిలిచే జీవిత భాగస్వామితో కలిసి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆమె సహకారం, ఆప్యాయత వల్లే జీవితం మరింత అర్థవంతంగా మారుతోంది’’ అని చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇది వైరల్ గా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కష్టపడి పనిచేసే ఏపీ సీఎం, ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు.
తమిళనాడు అభివృద్ధి ఎన్డీయేతోనే: చంద్రబాబు
ఎన్టీఆర్, ఎంజీఆర్ లు చాలా దగ్గరి స్నేహితులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం నిర్వహించారు. "ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో తమిళమే మాట్లాడతారు. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుంది. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి - కృష్ణ- కావేరి నదులు అనుసంధానం కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలు మనకొద్దు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది.. ఎన్డీయే మాత్రమే" అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
