FARMERS: రైతన్నకు ఎంత కష్టం.. ఎంత నష్టం

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచింది. వానాకాలం సీజన్లో అధిక శాతం మంది రైతులు మొక్కజొన్నపంటను వేశారు. పంట చేతికి వస్తున్న సమయంలో తుఫాన్ రావడంతో రైతులు మార్కెట్లో ఆరబోశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయిపోయింది. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
లక్ష ఎకరాల్లో వరి పంట నష్టం
అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది. అనపర్తి, రామచంద్రపురం, నిడదవోలు ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో రైతుల చేతికి అందాల్సిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో లబోదిబోమంటున్నారు. మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఎకరానికి 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
పంట నష్టంపై ప్రాథమిక నివేదిక
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించాలని, ప్రాథమిక నివేదిక తయారుచేసి డైరెక్టరేట్కు పంపించాలని బుధవారం క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. ఏఈవోలు, ఏఈవోలతోపాటు ఏడీఏలు కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలని, పంట నష్టం అంచనా వేయాలని సూచించారు. వరద నీటి ప్రవాహం తగ్గిన తర్వాత పంటల పరిస్థితి ఏమిటి? తేలిన తర్వాత కోలుకుంటాయా? లేకపోతే పూర్తిగా నష్టపోయినట్లేనా? పంట నష్టం ఎంత శాతం జరిగింది? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నీట మునిగిన పంటలు
భారీ వర్షాలకు అనకాపల్లిలోని శారద నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అనకాపల్లి మండలం వేంకపాలెం వద్ద వెదుర్లగెడ్డ నుంచి నీరు రహదారిపై ప్రవహిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో 1278 హెక్టార్లలో వరి పంట నీటి మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజవర్గంలో వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగు పొర్లుతున్నాయి. రెల్లిగెడ్డ ఉద్ధృతితో సిరిపురం - పొందూరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండవకుర్తి -టీడీ వలస గ్రామాల మధ్య కూడా అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తుపాన్ ప్రభావంతో రాజాం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

