ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకంపై ప్రభుత్వం పలు ఆంక్షలు

ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకంపై ప్రభుత్వం పలు ఆంక్షలు
కొత్త సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చేదు కానుక అందించిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మీద ఆధారపడి వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, రీయింబర్స్‌మెంట్‌ మీద ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.. ప్రైవేటు కాలేజీలో చదివే విద్యార్థులకకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదంటూ జీవో నంబర్‌ 77ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. వేలాది మంది పీజీ విద్యార్థులు తమ విద్యాను ప్రైవేటు కాలేజీల్లోనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం కానున్నారు. డిగ్రీ చదివిన పేద విద్యార్థి ఎంబీఏ చదవాలంటే ఏటా 30వేల వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది.. అంతేకాక, గ్రామీణ నేపథ్యం కలిగిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి ఎంఫార్మసీ చేయాలంటే లక్షా 25 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు భారమే అయినా, ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో కోర్సును కంప్లీట్‌ చేయగలుగుతున్నారు. ఇక ముందు అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదని తాజా జీవో ద్వారా అర్థమవుతోంది.

ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌, ఎయిడెడ్‌ పీజీ కాలేజీల్లో చదివితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని సర్కారు తేల్చేసింది. ఇప్పటికే కాలేజీలకు ఇవ్వాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.. బకాయిల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం ద్వారా మరోసారి ఆర్థిక భారం పడబోతోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు విద్యార్థినీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని.. కానీ, అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయవుతున్నా ఫీజ్‌ రీయింబర్స్‌ ఇవ్వకపోగా.. ఇచ్చే సాయాన్ని కూడా నిలిపివేడయం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు, ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. యూనిర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలను పరిమితం చేసింది.. ఏటా 70వేల మంది పేద విద్యార్థులు పీజీ కాలేజీల్లో చేరుతున్నారు.. అయితే, యూనిర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన వారంతా ప్రైవేటు కాలేజీలను ఆశ్రయించాల్సి వస్తోంది.. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇలాంటి వారందరికీ పెను భారంగా మారనుంది.. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అటు విపక్షాలు సైతం ఫైరవుతున్నాయి.. కొత్త సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చేదు కానుక అందించిందని మండిపడుతున్నాయి.. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story