FENGAL CYCLONE: తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను

తమిళనాడు-పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది. గంటకు 80-90 కి. మీ వేగంతో వస్తున్న ఈ తుపాను తీరాన్ని దాటేందుకు 3-4 గంటల సమయం పట్టింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నుంచి విమానాలు బంద్
ఫెంగల్ తుపాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో చెన్నైలోని విమానాశ్రయాన్ని అధికారులు మూసేశారు. తిరుపతిలో విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో హైదరాబాద్ నుంచి నడవాల్సిన విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలు రద్దు చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే 3 విమానాలు రద్దయ్యాయి.
ఏపీ, తెలంగాణలో అలర్ట్
ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏపీ, తెలంగాణల్లోనూ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్‌గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక తెలంగాణలో ఆదివారం, సోమవారాల్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.
సెలవులు రద్దు
ఫెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు సెలవులు పెట్టవద్దని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులంతా రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తుఫాన్ తీవ్రత, పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి.
సీఎం కీలక ఆదేశాలు
ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com