Dil Raju : దిల్ రాజు జగన్‌కు రాయబారిగా వ్యవహరిస్తున్నారా..?

Dil Raju : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం ఇంకా సద్దుమణగకముందే... ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. పేర్ని నానితో భేటీ కావడం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరితో కలిసి మచిలీపట్నంలోని పేర్ని నాని గెస్ట్ హౌజ్‌కు వెళ్లిన దిల్ రాజు.. ఆయనతో చాలా సేపు మంతనాలు జరిపారు. ఇదే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు పవన్‌పై మంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంటే.. అంతలోనే ఆయనతో భేటీ కావడం వెనక మర్మమేంటి అన్న చర్చ ఇప్పుడు సినీ పరిశ్రమలో నడుస్తోంది. ఇంతకీ దిల్ రాజు ఎటువైపు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. వారం రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ షరతులకు దిల్‌రాజు, నిర్మాతల బృందం ఓకే చెప్పింది. మళ్లీ ఇంతలోనే మంత్రితో మరోసారి సమావేశమవడం అనేక సందేహాలకు తావిస్తోంది.
పేర్నినానితో దిల్‌రాజు చర్చలు దేనికోసమన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చిత్ర పరిశ్రమ వైసీపీ ప్రభుత్వం వెనుక నిలిచింది అనే సంకేతమిచ్చేందుకేనా.. అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ను సినీ పరిశ్రమ భరించలేకపోతోందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇటీవలే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు నిజమనే సందేశం పంపేందుకే దిల్ రాజు మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దిల్ రాజు భేటీ నిజంగా సినిమా పరిశ్రమ కోసమా..? లేక టాలీవుడ్‌లో ఒక వర్గాన్ని దెబ్బతీయడానికా..? కన్ను నీదే.. వేలు నీదే సిద్ధాంతం తెరపైకి వచ్చిందా..? అన్నవే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ హాట్ సందేహాలు.
సినిమా టికెట్ల అమ్మకాన్ని స్వయంగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చినికి చినికి గాలివానగా మారుతోంది. దీని వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం... దానిపై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇవ్వడంతో... వివాదం తీవ్రమైంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పై నటుడు పోసాని కృష్ణమురళి వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయింది. ఇంతలోనే దిల్ రాజు ఇతర నిర్మాతలతో కలిసి మంత్రి పేర్ని నానితో భేటీ కావడం సినీ పరిశ్రమలో కొత్త అనుమానాలకు తావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com