Ganesh Immersion: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు, 40 మందికి గాయాలు

Ganesh Immersion: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు, 40 మందికి గాయాలు
X
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విషాదకర ఘటనలు

రాష్ట్రంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్‌ బోల్తాపడి మరో ప్రమాదంలో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. బాపట్ల జిల్లాలో ఓ గుడిసె దగ్ధమైంది.

విఘ్నేశ్వరుడి నిమజ్జన వేడుకల్లో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నిమనుబోలు మండలం కోదండరామపురంలో వినాయక చవితి ఊరేగింపులో ప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తుండగా ఓ ఇంటి ప్రహరీ గోడ పక్కన నిల్వ ఉంచిన బాణాసంచాపై నిప్పురవ్వలు పడి పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. పెద్ద మొత్తంలో బాణసంచా పేలడంతో అక్కడే ఉన్న కొందరు ఎగిరి పక్కన పడ్డారు.

టపాసులు నిల్వ ఉంచిన ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న రేకుల ఇళ్లు, ఇంటి తలుపులు, అద్దాలు, గేట్లు ధ్వంసమయ్యాయి. కరెంటు తీగలు కాలిపోయాయి. అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దుర్ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడురు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు వద్ద గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్లున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గూడురు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు నిర్వహించిన గణేశ్‌ నిమజ్జనోత్సవ వేడుకల్లో అపశ్రుతి జరిగింది. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో బాణాసంచా కాలుస్తుండగా తారాజువ్వలు పడి ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ. 70వేల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.

Tags

Next Story