AP: టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ దస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనపై అధికారులకు నాగార్జున అనే ఉద్యోగి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను ఆర్పివేశారు సిబ్బంది. అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనా? లేదా ఏమైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అగ్ని ప్రమాదం జరిగిన టీటీడీ పరిపాలన భవనం ఇంజనీరింగ్ సెక్షన్ ను సీవీ అండ్ ఎస్వో శ్రీధర్ పరిశీలించారు. పలు ఆలయాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనట్టు గుర్తించామన్నారు. ఈ ఫైలింగ్ ఉన్నందున డేటా మొత్తం సేఫ్ గా ఉంటుందని అంటున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై విచారణ కొనసాగిస్తున్నామని శ్రీధర్ తెలిపారు.
పోలవరం కార్యాలయంలోనూ...
పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాలు దగ్ధమవడం కలకలం సృష్టిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. కార్యాలయంలోని అధికారులే కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటకు వస్తాయనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన దస్త్రాలను ధవళేశ్వరం పోలీసుల స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. కాల్చివేసిన దస్త్రాలను ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ శివజ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెసల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారానికి సంబంధించిన దస్త్రాలుగా ప్రాథమికంగా నిర్ధరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి దస్త్రాలను దగ్ధం చేసిన కార్యాలయ సిబ్బందిని అధికారుల బృందం విచారిస్తోంది. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపట్టారు. కాలి బూడిదైన దస్త్రాలను ఆమె పరిశీలించారు. పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలోని బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయట పడేశామని స్పెషల్ కలెక్టర్ సరళా వందనం తెలిపారు. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు.. సిబ్బంది తగల బెట్టిన కాగితాలు ఉపయోగం లేని మాత్రమే అని స్పెషల్ కలెక్టర్ వెల్లడించారు.
మంత్రి సంచలన వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పత్రాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ పత్రాలు పోలవరం ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ భూ సేకరణకు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రాల దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రాలను వైసీపీ వాళ్లే తగలబెట్టారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని, ఎవరికి కనిపించకుండా మాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను అసలు వదిలిపెట్టమని మంత్రి నిమ్మల హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com