రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి నేటితో ఐదేళ్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి నేటితో ఐదేళ్లు పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమరావతి నిర్మాణ పనులు జోరుగా జరుగుతుండగా.. ఎన్నికలు వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇక అక్కడి నుంచి అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చింది.
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్లాన్‌తో... అమరావతి కోసం 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఆగమ్యగోచరమైంది. వాళ్లంతా ఈ రోజున నడిరోడ్డునపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. 310 రోజులుగా అనేక రకాలుగా రైతులు, మహిళలు ఉద్యమిస్తున్నారు. పాలకులు చేస్తున్న అవహేళనవల్ల తీవ్ర మనోవేదనకు గురై.. 90 మందికిపైగా రైతులు గుండె ఆగి మరణించారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఈ రోజున ధృతరాష్ట్ర పాలనను పోషిస్తూ .. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రైతులకు సంఘీభావంగా.. గుంటూరులోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయినిపాలెం వరకు.. అమరావతి జేఏసీ నేతలు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com