ముదురుతున్న జనసేన, వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్

పల్నాడు జిల్లా అచ్చంపేటలో వైసీపీ vs జనసేన ఫ్లెక్సీవార్ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నాయకుడు నీలం ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అచ్చంపేట మండల కేంద్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాంట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నట్లుగా ఉండడంతో జనసేన పార్టీ నాయకులు ఆగ్రహించారు.
ఫ్లెక్సీలు తొలగించాలంటూ అధికారులకు తెలియజేశారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో జనసేన పార్టీ నాయకుడు నీలం ప్రసాద్ ఫ్లెక్సీ లో ఉన్న తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కొద్దిపాటి బొమ్మను తొలగించాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నీలం ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు జనసేన పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు. ప్రసాద్‌ను అరెస్ట్ చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరకు జనసేన పార్టీ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని,నీలం ప్రసాద్‌ను వెంటనే విడిచి పెట్టాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును కూడా భీమవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటల్లో తొలగించాలని కొటికలపూడి గోవిందరావు అధికారులకు మొన్న వినతి పత్రం ఇచ్చారు. అయినా కూడా ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ఈరోజు కార్యచరణ ప్రకటిస్తాను అని చెప్పడంతో ఆయనను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి పోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో భీమవరం జనసేన కార్యాలయానికి జన సైనికులు భారీగా చేరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com