భారీ వర్షాల కారణంగా 'కంభం' చెరువుకు వరద నీరు

భారీ వర్షాల కారణంగా కంభం చెరువుకు వరద నీరు
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో పలు చోట్ల చెరువులు..

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సగిలేరు ఉప్పొంగడంతో.. గిద్దలూరులో రోడ్లపైకి భారీగా నీరు ప్రవహిస్తోంది. వందల ఇళ్ల నీట మునిగాయి. సగిలేరు, గండ్లకమ్మ కాలువలు పొంగిపోర్లుతున్నాయి. కంభం చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇంకొల్లు మండలంలోని అప్పేరు, చినవాగులు ఉప్పొంగుతున్నాయి. కారంచేడు అలుగువాగు ఉధృతికి లోతట్టు ప్రాంత పొలాలు నీట మునిగాయి. అడుసుమల్లి గ్రామంలో రామాలయం ప్రహరి గోడ విరిగిపడింది. బేస్తవారిపేట మండలంలో పెంచికలపాడు చెరువుకట్ట తెగింది. దీంతో 150 ఎకరాల్లో కోసి కుప్పలుగా పెట్టిన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. నాసిరకం నిర్మాణం వల్లే కట్ట తెగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు ప్రకాశం జిల్లా కంబం మండలంలో రావిపాడు వద్ద గుండ్ల కమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవహారంలో... ఓ ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. దీంతో.. రంగంలో దిగిన పోలీసులు, సహాయక సిబ్బంది.... ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు రైతులను రక్షించారు. వీరంతా ఒడ్డుకు చేరుకోవడంతో... స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బుట్టాయగూడెంలో కొండవాగులో ఓ కారు చిక్కుకుంది. ఓ వ్యక్తి కారుతోపాటు కొట్టుకుపోగా... మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. కర్నూల్‌ జిల్లా ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వెలుగోడు పట్టణంలోని పలుకాలనీల్లోకి వర్షం నీరు చేరింది. నంద్యాల డివిజనల్‌లో వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. నిప్పులవాగు, మద్దిలేరు వాగు పొంగి ప్రవహిస్తున్నాయి.

అటు అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రిలో కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాడికి, పెద్ద పప్పూరులో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుత్తి - తాడిపత్రి మధ్య రాకపోకలు స్థంబించాయి. కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడపలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలధాటికి ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మునమాక వద్ద భారీ వానలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విప్పర్లపల్లితో సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు తాడికొండ నియోజకవర్గ పరిధిలో వందలాది ఎకరాలు పంటలు నీటమునిగాయి. పలుచోట్ల రోడ్లకు గళ్లు పడ్డాయి. గూంటూరూ నుంచి అమరావతి వెళ్లే ప్రధాన రహదారిపై లాం వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూళ్లురు మండలం పెదపరిమి వద్ద ఎద్దువాగుపై 3 అడగులు మేర నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా... పంటలు నీట మునిగిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్డు సౌకర్యాలు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story