పాచిపోయిన ఫుడ్‌కి ప్యాచప్ చేసి వేడి వేడిగా.. రెస్టారెంట్ నిర్వాకం

పాచిపోయిన ఫుడ్‌కి ప్యాచప్ చేసి వేడి వేడిగా.. రెస్టారెంట్ నిర్వాకం
కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు చాలా మంది రెస్టారెంట్ యజమానులు. పట్టుబట్టిన వాడే దొంగ..

హోటల్‌కి వెళితే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అరగంటలో వచ్చేస్తుంది.. సెగలు కక్కుతున్న భోజనం ప్లేట్లో పడగానే సెకను కూడా ఆలోచించకుండా ఆస్వాదిస్తూ లాగించేస్తాం. ఇలాంటివి చదివినప్పుడు, విన్నప్పుడు మాత్రం హోటల్‌కి వెళ్లాలంటే భయం పట్టుకుంటుంది. కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు చాలా మంది రెస్టారెంట్ యజమానులు. పట్టుబట్టిన వాడే దొంగ.. లేదంటే మూడు ప్లేట్లు.. ఆరు పార్శిళ్లుగా వారి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంటుంది. తాజాగా కర్నూలులో పాచి పోయిన బిర్యానీ వడ్డిస్తూ పట్టుబడ్డారు మదీనా రెస్టారెంట్ యాజమాన్యం.

నగరం నడిబొడ్డున ఉన్నయూకాన్ ప్లాజాలో ఉంటుంది మదీనా హోటల్. ఆరోగ్య అధికారి భాస్కర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి హోటల్‌కి వెళ్లారు. బాగా రద్దీగా ఉంది.. నాన్ వెజ్ వంటకాలు ఘుమ ఘుమ లాడుతున్నాయి. కబుర్లు చెప్పుకుంటూ తింటున్న కస్టమర్ల మధ్యలో నుంచి అధికారి నేరుగా హోటల్ కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడున్న చికెన్ చూసి ఉలిక్కి పడ్డారు. మాంసం బూజు పట్టి ఉంది.

డీప్ ఫ్రీజర్‌లో ఉంచిన మాంసం ముక్కలు గడ్డకట్టి వాటిపై ఐస్ ఏర్పడింది. పాచిపోయి వాసన వస్తున్న చికెన్ షోర్వా, రెండు రోజుల క్రితం వండిన బిర్యానీ, కుళ్లి పోయేందుకు సిద్ధంగా ఉన్న మటన్.. మరికొన్ని వెరైటీలు కనిపించాయి. ఇవన్నీ వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న పదార్థాలు. ఆర్డర్ చేసిన వెంటనే స్టవ్ మీద ఉంచిన బాండీలో వేసి మసాలాలు దట్టించి వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు. వీటన్నింటినీ గమనించిన అధికారులు వెంటనే ఆ హోటల్‌ను సీజ్ చేశారు.హోటల్ బయటకి బావున్నా కిచెన్ ఎలా ఉందో తెలిస్తే ముద్ద దిగదు. అసలే కోవిడ్ మహమ్మారి మనుషుల ప్రాణాలు హరిస్తుంటే.. మరో పక్క ఇలాంటి ఆహారాన్ని అందించే డబ్బే పరమావధిగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు హోటల్స్ యాజమాన్యం.

జిల్లా కేంద్రంలోని కొన్ని హోటల్స్ యాజమాన్యాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మాంసాహార వంటకాల్లో రంగు, రుచి కోసం మరి కొన్ని అదనపు హంగులు జోడిస్తున్నారు. కస్టమర్ ఆర్డర్ చేశాక సర్వ్ చేస్తుండడంతో లోపాలు భయటపడడం లేదు. లోపల ఏం చేస్తున్నారో తెలియకుండానే తినేస్తున్నారు.కుళ్లిన మాంసానికి రసాయనాలు ఎక్కించి వాసన రాకుండా చూసుకుంటున్నారు. మటన్ షాపు యాజమాన్యాలు హోటల్స్‌కి సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కుళ్లిన మాంసంలో బ్యాక్టీరియాతో పాటు ట్రాక్సిన్ ఉంటుంది. దీన్ని వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది కానీ.. ట్రాక్సిన్ చనిపోవు. ఇవి ఆరుగంటల్లో కడుపులోకి పోయి ఫుడ్ పాయిజన్ అవుతుంది.

దీనివల్ల జ్వరం, కడుపు నొప్పి, విరోచనాలు, శరీరం నిస్సత్తువగా అనిపించడం జరుగుతాయి. అయితే ఫ్రీజర్‌లో ఉంచిన మాంసం 10 రోజుల వరకు వాడుకోవచ్చు. కానీ ఒకసారి తీసిన తరువాత మళ్లీ ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు అని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. వెంకట రంగారెడ్డి తెలియజేశారు.

Tags

Next Story