AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై రేపే స్పష్టత..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు( శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఇక, పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు.. గీతకార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఉగాది నుంచే ఉచిత బస్సు
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫీల్డ్ విజిట్స్ చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందచేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఉగాది నాటికి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రాబాబు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com