BALAYYA: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

BALAYYA: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ
X
తెలుగు ప్రజలందరూ అదే కోరుకుంటున్నారన్న బాలయ్య... నట సింహాన్ని సత్కరించిన కేంద్రమంత్రి

దివంగత నటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టాలీవుడ్ స్టార్, నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్న బాలయ్య.. తెలుగు ప్రజల కోరిక మేరకు ఆ మహానటుడికి భారతరత్న ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఎన్డీయే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, దీనిని బిరుదుగా కంటే బాధ్యతగా స్వీకరిస్తానన్నారు.

బాలకృష్ణకు కిషన్ రెడ్డి సన్మానం

బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బాలయ్య ఇంటికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. తనని పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి బాలయ్య ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణకు అభినందనలు

నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించినందుకు గాను సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. నటనరంగంలో తండ్రికి తగ్గ తనయుడిగా, చిత్ర రంగంలో ఏ నటుడు నటించని పాత్రలో పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాలు, నటించడంలో తనకు తానే సాటి అన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

పద్మ భూషణ్ అవార్డు పొందిన నందమూరి బాలకృష్ణకు కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ నివాసంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు యావత్ తెలుగు సినీ పరిశ్రమకు రావడం గర్వకారణం అన్నారు. తండ్రికి తగ్గ వారసుడుగా సినీ, రాజకీయ, సేవా రంగాల్లో దిగ్విజయంగా రాణిస్తున్నారన్నారు. బాలకృష్ణ నటనతో దేశ విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు.

ఎంతో గర్వకారణం

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. అలాగే నటనలో అగ్రపీఠాన్ని అధిరోహించారని కొనియాడారు. బసవతారకం హాస్పిటల్ నెలకొల్పి ఎంతో మంది పేదలకు వైద్యాన్ని అందజేశారని అన్నారు.

Tags

Next Story