RAINS: ఎడతెరపిలేని వానలు.. పొంగిన వాగులు

-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉధృతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభిం చింది. ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వేలేరు పాడు మండలంలో జల విలయం తాండవించింది. క్షణాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులన్ని నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎద్దు వాగు బ్రిడ్జిపై నుంచి కొన్ని మీటర్ల ఎత్తున వరద ప్రవహించటంతో వరద తీవ్రతకు వంతెనకు ఇరు వైపులా నిర్మించిన అప్రోచ్ రోడ్డు కొట్టుకు పోయి కేవలం వంతెన మాత్రం మిగిలింది.
పెదవాగు ప్రాజెక్టు ఎగువ భాగంలోని గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రస్థాయిలో వరద పోటెత్తింది. ఆరు మీటర్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు బుధవారానికే ఐదు మీటర్ల నీటిమట్టం చేరుకుంది. అతి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు కనివినీ ఎరు గని రీతిలో వరద వచ్చి పడింది. అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లకు రెండింటిని మాత్రమే తెరవగలిగారు. మూడో గేటు తెరిచేందుకు నానా అగచాట్లు పడ్డారు. వరద తీవ్రత అధికమై ప్రాజెక్టు కట్ట మీద నుంచి నాలుగుచోట్ల వరద పొంగిపొర్లింది. చివరకు అధికారులు మూడో గేటు తెరిచేందుకు శతవిధాలా ప్రయత్నించి సఫలమయ్యారు. 17 వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువన ఉన్న పెదవాగులోకి వదిలివేశారు. ప్రాజెక్టుకు అంతకంతకు వరద పెరుగుతూనే ఉండటంతో ఆ ప్రభావం కట్టపైపడి పలు చోట్ల గండిపడే ప్రమాదం ఏర్పడింది.
ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్ట తెగిపోనుందనే సమాచారంతో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు దిగువనే ఉన్న గుమ్మడిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించే దిశగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్ చర్యలు ప్రారంభించగా మండలంలోని 10 గ్రామాల ప్రజలను స్థానిక రెవెన్యూ అధికారులు ఫోన్ల ద్వారా అప్రమత్తం చేసి వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న కమ్మరగూడెం, అల్లూరినగర్, కోయ మాధారం, ఒంటిబండ, ఊటగుంపు, రామవరం, గుళ్ళవాయి, గ్రామాల్లోకి వరద పోటేత్తింది. వాగులను తలపిస్తూ ఈ గ్రామాల్లో వరద ప్రవహించటంతో కొన్ని ఇళ్ళు నేలమట్ట మయ్యాయి. కమ్మరగూడెంలోకి పెద వాగు వరద గ్రామాన్ని ముంచి వేయడంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని కొండ గుట్టపైకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు.
పెదవాగు ఉధృతి కారణంగా అల్లూరినగర్, రెడ్డిగూడెం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపైకి వరద ఉధృతంగా ప్రవహించటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. వేలేరుపాడు, రుద్రమ్మకోట రహదారిపై వరదతో రాకపోకలు నిలిచాయి. వేలేరుపాడు, కోయిద రహదారి మధ్య అనేకచోట్ల రహదారికి గండ్లుపడ్డాయి. నాళ్ళవరం కాలనీ సమీపంలో కొండ వాగులు పొంగటంతో పశువులు వరదలో కొట్టుకు పోయాయి. మొత్తంగా వేలేరుపాడు మండలాన్ని భారీ వర్షం అతలకుతలం చేయడంతో కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఉదయం నుంచి సరఫరా నిలిచిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com