AP:ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెల్లడైంది. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. అందులో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్టీయూ గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసులు నాయుడుకు 7,210 ఓట్లు, రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. రెండో రౌండ్‌లో శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రౌండ్‌లో రాధాకృష్ణ, ఐదో రౌండ్‌లో సత్యనారాయణ, ఆరో రౌండ్‌లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్‌లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్‌లో సూర్యప్రకాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. చివరకు రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు పోటీలో మిగలగా.. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
కూటమికి ఇబ్బందిగా టీచర్ ఫలితం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు గట్టి షాక్ తగిలింది. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో నిలిచిన గాదె శ్రీనివాసులునాయుడుని ఉపాధ్యాయులు గెలిపించారు. ఈ ఫలితంతో టీచర్లు... కూటమి ప్రభుత్వం పట్ల తమ వైఖరిని చాటారా అని చర్చ సాగుతోంది. రఘువర్మకు తొలి ప్రాధాన్యత ఓట్లు, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ ఎక్కడా మెజార్టీ రాకపోవడం కూటమికి ఇబ్బందే అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మొదటి నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ముందంజలో కొనసాగుతూ వచ్చారు. ఎక్కడ కూడా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థి పోటీనివ్వలేదు. మొత్తం 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. . గాదె విజయం ఖాయం కావడంతో అతడి మద్దతుదారులు, పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com