నిరాడంబరంగా గణపయ్య నిమజ్జనోత్సవం
నవరాత్రి పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనోత్సవం...

నవరాత్రి పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనోత్సవం... నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా దృష్ట్యా ఎలాంటి హడావుడి లేకుండా ప్రతిమల జల ప్రవేశం నిర్వహిస్తున్నారు. ఏటా కన్నుల పండువగా జరిగే ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మహా నిమజ్జనాలు.. ఎలాంటి సందడి లేకుండా జరగనున్నాయి. కాసేపట్లో నిమజ్జన శోభయాత్ర ప్రారంభం కానుంది.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనాల కోసం జనం తరలివస్తున్నారు. ఏటా లక్షకు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించే భాగ్యనగరంలో నవరాత్రి సందడి కనిపించడం లేదు. గతేడాది నిమజ్ఞనానికి 51 క్రేన్లను ఏర్పాటు చేస్తే.. ఈ సారి 18 క్రేన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సారి 1 అడుగు నుంచి 9 అడుగుల లోపు గణనాథులను మాత్రమే ప్రతిష్టించడంతో... పెద్దగా క్రేన్ల సాయం లేకుండానే వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తున్నారు. గ్రేటర్‌లోని 23 కొలనుల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌కు 10 వేల విగ్రహాల కంటే ఎక్కువగా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
అటు.. సరూర్‌నగర్, కూకట్‌పల్లి చెరువుల వద్ద నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గణేశ్ యాత్ర రూట్‌మ్యాప్ రూపొందించి.. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హుస్సన్ సాగర్ పరిసరాలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం కోసం వచ్చే వాహనాల పార్కింగ్‌కు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.
ఏటా నిర్వహించినట్టుగానే ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర నిర్వహించనున్నారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు శోభయాత్ర జరగనుంది. అనంతరం క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం జరుగుతుంది. శోభయాత్రకు భక్తులెవరు రావద్దని ఉత్సవ నిర్వాహకులు సూచించారు.