రూ.5 వేలు ఇస్తే ఆధార్‌లో అడ్డగోలు మార్పులు.. రూ.10 వేలు ఇస్తే..

రూ.5 వేలు ఇస్తే ఆధార్‌లో అడ్డగోలు మార్పులు.. రూ.10 వేలు ఇస్తే..

ఆధార్‌కార్డులో పేరు మార్చాలా..? వయసు కూడా పెంచేసి చూపించాలా? ఏ ధృవపత్రాలు లేకపోయినా పర్వాలేదు. ఓ 5 వేలు ఇస్తే అన్నీ చిటికెలో చేసేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఆధార్‌కార్డే కాదు పాన్‌ కార్డుల్లోనూ వివరాలు అడ్డగోలుగా మార్చేసి దర్జాగా దందా సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ తరహా మోసాలు ఇప్పటికే వెలుగు చూడగా.. తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీ లెటర్‌హెడ్‌లు, స్టాంప్‌లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే అందుకు అవసరమైన మార్పులు తాము చేసిపెడతామంటూ జనాలకు గాలం వేసి ఈ ముఠా దందా సాగిస్తోంది. ఎలాంటి వివరాలు లేకపోతే 10 వేల వరకూ, చిన్న చిన్న మార్పులు చేయాలంటే 5 వేల వరకూ వసూలు చేస్తూ దందాకు పాల్పడుతోంది. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించేందుకు చాలా మంది ఇలాంటి నకిలీ బ్యాచ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే 40 ఏళ్ల వయసున్న వ్యక్తి వయసు 60 ఏళ్లకు మార్చేస్తున్నారు. ఇందుకు జనన ధృవీకరణ పత్రమో, టెన్త్ మార్కుల లిస్టో సమర్పించాల్సి ఉన్నా అవన్నీ ఫొటోషాప్‌లో నకిలీవి తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. చేయూత పథకం కావచ్చు, ఆసరా కావచ్చు, నేతన్న నేస్తం, వైఎస్సార్ పెన్షన్లు ఇలా ప్రతి పథకంలోనూ అనర్హుల్ని లబ్దిదారులుగా చేర్చేందుకు ఈ ఆధార్ మాఫియా డబ్బులు తీసుకుని దందా చేస్తోంది. కర్నూలు జిల్లాలోనే 10 గ్రామ సచివాలయాల్లో దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తే దాదాపు 200 అప్లికేషన్లలో తప్పుడు డేటా ఉన్నట్టు గుర్తించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

Tags

Next Story