గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు

గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు
సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు.

బహుమతుల పేరుతో ఫ్రాడ్ చేస్తున్న ముఠా.. రాచకొండ సైబర్ క్రైమ్‌కు చిక్కింది. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్ నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో సోఫియా అనే అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. మీకోసం ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వస్తున్నాను అని మెసేజ్ పెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాను.. నా దగ్గర 75వేల పౌండ్స్ క్యాష్, గోల్డ్ చైన్స్, మొబైల్ ఫోన్‌కు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని బాధితుడితో డబ్బులు వేయించుకున్నారు. ఇంకేముందు ఒక్కసారి డబ్బులు వారి ఖాతాలో పడితే చాలు.. ఖేల్‌ ఖతం దుకాన్‌ బంద్‌. వెంటనే సెల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఇలాంటి మోసాలు నిత్యం ఎక్కడోక చోట జరుగుతూనే ఉంటున్నాయి.

ఇలాంటి ముఠా సభ్యులు ఢిల్లీలో ఒక చోట కలిసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. డింగ్ టోన్ అనే యాప్‌ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారని.. తమ అకౌంట్లో వేయించుకున్న నగదుతో ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అనుమతించకూడదని తెలిపిన పోలీసులు.. ఇలాంటి తరహాలో మోసాలు పెరుగుతున్నాయన్నారు. మ్యాట్రిమోనీ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని.. జేమ్స్ బాండ్ లాగా ప్రొఫైల్ తయారు చేసి మోసం చేస్తున్నారన్నారని తెలిపారు. రాచకొండలో ఏడుగురు వీరి చేతిలో మోసపోయినట్టు వెల్లడించారు.

సోషల్‌ మీడియా ఖాతాదారులను టార్గెట్‌గా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు పెచ్చుమీరుతున్నారు. టెక్నాలజీ పెరిగేకొద్ది.. మోసాలు భారీగానే జరుగుతున్నాయి. ఇటువంటి మాయగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story