GLOBE TROTTER: నేడే గ్లోబ్ ట్రోటర్ డే ఈవెంట్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గ్లోబ్ ట్రాటర్' మూవీ ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీ వేదికగా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూవీ అప్డేట్స్‌ని దాచేస్తూ వచ్చిన రాజమౌళి ఈ ఈవెంట్‌లో కీలక విషయాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి పృథ్వీరాజ్ లుక్, ప్రియాంక చోప్రా పోస్టర్ రిలీజ్ అవ్వడమే కాకుండా గ్లోబ్ ట్రాటర్ సంచారి సాంగ్ సెన్సేషన్‌గా మారింది. ఇక ఈవెంట్‌లో మహేష్ లుక్‌తో పాటుగా ఒక టీజర్ కూడా రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారట.
రాజమౌళి సినిమాలు ఎందుకంత పర్ఫెక్ట్ గా ఉంటాయి? ప్రతి సినిమాతో రాజమౌళి ఎలా సూపర్ హిట్ అందుకుంటున్నాడు అంటే అతని ప్లానింగ్ అని అందరు సమాధానం చెబుతారు. సినిమా కథ రాసినప్పటి నుంచి సెట్స్ మీదకు వెళ్లడం.. షూటింగ్.. రిలీజ్ ప్రమోషన్స్.. రిలీజ్ తర్వాత కూడా రాజమౌళి పనిచేస్తాడు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ అంటే రాజమౌళి క్రియేటివ్ టీం అంతా రెక్కలు తొడిగేసుకుంటుంది. రాజమౌళి ప్లానింగ్ లో భాగంగానే ఈవెంట్ ఎలా చేయాలి.. ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారు. నేడు జరగనున్నగ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కి కూడా రాజమౌళి ఇలాంటి భారీ ప్లానింగ్‌తోనే వస్తున్నారు. ఈ ఈవెంట్‌కి హోస్ట్ గా స్టార్ యాంకర్ సుమని ఫిక్స్ చేయగా, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మొత్తం చూసేయాలి కాబట్టి ఇండియన్ టాప్ యూట్యూబర్ చంచలానిని రంగంలోకి దింపారు. అయితే, ఈ ఈవెంట్ యూట్యూబ్ లో కాకుండా జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఫారెన్ ఆడియెన్స్ కోసం ఏకంగా హాలీవుడ్ మీడియా 'వెరైటీ' యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమ్ చేయనుండటం ఊహలకు అందని విషయం.
ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమా ఈవెంట్ కోసమే ఇంత భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఈవెంట్ ఎలా జరగాలి అన్నది ముందే సుమ, ఆశిష్ తో పాటు కార్తికేయ, కీరవాణి అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తన సినిమా ఈవెంట్ కూడా తన మార్క్ ఉండేలా చూస్తాడు అన్నది చెప్పడం కాదు ఈవెంట్ కోసం కూడా రాజమౌళి చూపించే డెడికేషన్ చూసే సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్.
పాసులు కాదు పాస్‌పోర్టులు
ఈ ఈవెంట్ కన్నా ముందే అందుకోసం రూపొందించిన పాస్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం చిత్రబృందం 'పాస్‌పోర్ట్ స్టైల్'లో ప్రత్యేక పాస్‌లను తయారు చేసింది. పసుపు రంగు అట్టతో, దానిపై "GLOBETROTTER EVENT", "PASSPORT" అని ముద్రించి ఉన్నాయి. ప్రీలుక్‌లో మహేశ్ మెడలో కనిపించిన త్రిశూలం లోగోను కూడా ఈ పాస్‌పై డిజైన్ చేశారు. లోపల మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫొటోలతో పాటు ఈవెంట్ గైడ్‌లైన్స్, మ్యాప్ వంటి వివరాలను పొందుపరిచారు. అచ్చం అసలు పాస్‌పోర్ట్‌లా కనిపించడం దీని ప్రత్యేకత. ఈ క్రియేటివ్ ఐడియా చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం సృజనాత్మకతే కాకుండా దీని వెనుక పక్కా మార్కెటింగ్ వ్యూహం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా వర్కింగ్ టైటిల్ 'గ్లోబ్‌ట్రాటర్'కు తగ్గట్టుగా పాస్‌పోర్ట్ థీమ్‌ను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

