Ap news: శరవేగంగా గోదావరి వంతెనపనులు

మంత్రి తుమ్మల నాగేశ్వరర్రావు ఆదేశాలతో గోదావరి వంతెనపనులు శరవేగంగాసాగుతున్నాయి. ఆ వంతెన అందుబాటులోకి వస్తే నాలుగు రాష్ట్రాలకు మేలు జరుగనుంది. గతంలో వరదలు వచ్చినప్పుడు పలు కాలనీల్లోకి నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కరకట్టవిస్తరణ పనులు చేపట్టడంతో వరదలు వచ్చినా కాలనీల్లో రాకుండా చర్యలు చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం పట్టణంలో గోదావరినదిపై నిర్మిస్తున్న వంతెన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఒడిషా మధ్య రాకపోకలను అనుసంధానం చేస్తుంది. గతంలో నిర్మించిన వంతెన 50 ఏళ్లు పూర్తై పాతబడటంతో కొత్త బ్రిడ్జి నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా...మంత్రిగా ఉన్న తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత భారాస సర్కారు అధికారంలోకి రావడంతో వంతెన పనులు నత్తనడక సాగాయి. ఐతే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమిపాలైనా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు గెలిచారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం కరకట్టను పొడిగించి రెండో వంతెనపనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. పనులు తొందరగా పూర్తి చేయడానికి మంత్రి తుమ్మల కోటి రూపాయలు నిధులు విడుదల చేయించారు. వారంవారం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏప్రిల్ 17న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం వరకు రెండోవంతెన పూర్తిచేయాలని అధికారులని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక ఆల ఇతర అధికారులు రెండోవంతెన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
గోదావరిపై కరకట్ట నిర్మించి చాలాకాలమైంది. కూనవరం రోడ్డులో సుమారు 700 మీటర్లు మేర కరకట్ట పోయకుండా మిగిలిపోవడంతో అటువైపు నుంచి వరదనీరు వచ్చి శాంతినగర్, సుభాష్‌నగర్ కాలనీలు ప్రతీ ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఆ కాలనీల్లో సుమారు పదివేల కుటుంబాలు నివసిస్తున్నాయి.ప్రతి ఏడాది వచ్చే వరదకంటే 2023లో గోదావరి వరద కొంతమేరకు తక్కువగా రావడం వల్ల.. ఇబ్బంది రాలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గోదావరివరదలపై సమీక్షించి మళ్లీ వర్షాలు వచ్చేలోగా కాలనీలు ముంపుబారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కరకట్ట విస్తరణ పనులుతోపాటు 8 ఏళ్లుగా నత్త నడకన సాగుతున్న గోదావరి రెండోబ్రిడ్జి పనులు తొందర్లో పూర్తిచేయాలని ఆదేశించింది. వచ్చే వర్షాకాలం నాటికి భద్రాచలంలోని లోతట్టు బాధితుల మొహాల్లో ఆనందం కనబడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రెండో వంతెన పనులు శరవేగంగా సాగుతుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com