AP Rains : ముంచెత్తుతున్న వరదలు.. రాకపోకలకు బ్రేక్

AP Rains : ముంచెత్తుతున్న వరదలు.. రాకపోకలకు బ్రేక్
AP Rains : ఏపీలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

AP Rains : ఏపీలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్‌వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిజల్లాల్లో వరదలు ముంచెత్తాయి. లంకగ్రామాల్లోకి నీరుచేరింది... రోడ్లపై నీరుచేరడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారు.

పశ్చిమ గోదావరి

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షంకారణంగా ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. దీంతో గోదావరినది ఉగ్రరూపం దాల్చి పరవళ్లు తొక్కుతోంది. పశ్చిమ గోదావరిజిల్లాలో వశిష్ట గోదావరికి ఎగువనుంచి భారీగా వరద రావడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాలకుసంబంధాలు తెలిపోయాయి. అచంట మండలం పెదమల్లం లంక, అయోధ్య లంక, మరిమూల లంక,నాగుల లంక చుట్టుపక్కల వరదనీరువచ్చి చేరడంతో లంకగ్రామాలకు రాకపోకలకోసం పడవలను ఆశ్రయిస్తున్నారు. ప్రవాహం పెరుగడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు

ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భారీ వరదతో ప్రాజెక్టు దగ్గర… నీటిమట్టం 35 మీటర్లను దాటింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జులై నెలలోనే గోదావరికి వరద రావడంతో అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి వదిలేస్తున్నారు.

రాజానగరం

భారీ వర్షాల కారణంగా ఏపీలోని రోడ్ల పరిస్థితి ఎలా ఉందో రాజానగరంలోని రోడ్లు చూస్తే అర్ధమవుతుంది. ఓ మోస్తరు వర్షాలకే రహదారులు పెద్దపెద్ద గుంతలు తేలి... రాకపోకలకు వీలులేకుండా మారిపోయాయి. రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓ రహదారికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రోడ్డుపై నిలిచి ఉన్న నీళ్లలో బాతులు స్వేచ్చగా స్నానాలు చేయడం చూస్తుంటే.. రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

యలమంచలి మండలం

గోదావరి నదిలో నీటి ఉధృతి పెరుగడంతో పశ్చిమగోదావరిజిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామం ప్రతియేటా వరదలు వచ్చిన ప్రతిసారి పడవలపైనే ప్రయాణించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. కాజ్‌ వే నీటమునగడంతో తమకు ఇబ్బందులు తప్పడంలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నదిలో నీటి ఉధృతి పెరగడంతో రెండు నెలలపాటు తాము పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నామన్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

యానాం

భారీ వర్షాల కారణంగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గ పరిధిలోని ఎదుర్లంక వారధి వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీరు చేరడంతో అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో యానాంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. యానాం పరిపాలనాధికారి కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ బీచ్‌ కి వెళ్లేప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు భూపతిపాలెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు గేటును ఎత్తి 450 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో చుట్టుపక్కలప్రాంత వాసులను అప్రమత్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story