GOOD NEWS: ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ దసరా కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామంటూ ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవరన్నలకు ఉపశమనం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా నుంచి ‘వాహన మిత్ర’ అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు. దసరా రోజున ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (స్త్రీ శక్తి) అమలు వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రత్యేక సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించాలని నిర్ణయించారు.
ఇదీ ప్రజా ప్రభుత్వం: చంద్రబాబు
‘‘సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పాలనను గాడిలో పెడుతున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేలు ఇచ్చాం. తల్లికి వందనం అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారు. ’’ అని చంద్రబాబు తెలిపారు. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్ హిట్ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం.’’ అని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు సూటి ప్రశ్నలు
సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ల, సూపర్ సిక్స్‌పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా అంటూ ప్రజలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటే హేళన చేశారన్నారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యమని పేర్కొన్నారన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు... దీపం వెలగదన్నారు... ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..: పవన్
అనంతపురం: ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్‌సిక్స్ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్యబీమా కల్పించాం. ఒకే రోజు రికార్డుస్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం’’అని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్న ఈ సభలో, కూటమి ప్రభుత్ వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆర్థిక సాయం ప్రకటన ఆటో డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com