శ్రీవారి భక్తులకు శుభవార్త.. బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది రెండుసార్లు..

ఈ సంవత్సరం సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరగనున్న శ్రీవారి జంట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తితిదేలోని అన్ని విభాగాలతో తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం ఉంటుంది. అదేరోజు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 22న గరుడసేవ, 23న స్వర్ణ రథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం జరుగుతాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభమై 19న గరుడ వాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణ రథం, 23న చక్రస్నానంతో సమాప్తం అవుతాయి. రెండు బ్రహ్మోత్సవాలు కలిసి వస్తుండడంతో ఈ సంవత్సరం భారీగా యాత్రికుల రద్దీ ఉండొచ్చని తితిదే భావిస్తోంది. పవిత్ర మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా ప్రణాళికలు రూపొందించాం అని ఈవో వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com