Sree Satya Sai District: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

Sree Satya Sai District: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

శ్రీసత్యసాయి జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో దళారులు రెచ్చిపోతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను సైతం అమ్మేసుకుంటున్నారు. ఓ దళారీకి కరెన్సీ కట్టలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వారి సంభాషణలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, రెవెన్యూ అధికారుల పేర్లను ప్రస్తావించడం దుమారం రేపుతోంది. వైసీపీ నాయకులు, రెవెన్యూ ఉన్నతాధికారుల అండతోనే భూదందా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కదిరిలో హిందూపురం రోడ్డుకు అనుకొని సర్వే నెంబర్‌ 83లో విలువైన ప్రభుత్వ భూమి ఉంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. నివాసానికి అనువుగా లేకపోవడంతో ఎక్కువ మంది పట్టాలు తీసుకోవడానికి విముఖత చూపారు. ఇచ్చిన పట్టాలను రద్దు చేయకుండానే మరో చోట లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులతో సన్నిహితంగా మెలిగిన నారాయణ పాల్ అనే వ్యక్తి... ఆ పట్టాలను తన వద్దే ఉంచుకున్నారు. ఒక్కొక్క పట్టాను గుట్టుగా విక్రయిస్తున్నారు. నల్లచెరువు మండలానికి చెందిన ఓ వ్యక్తికి పట్టా ఇచ్చేందుకు... నారాయణపాల్‌ పెద్ద ఎత్తున డబ్బు తీసుకుంటున్న వీడియో బయటికి వచ్చింది. నాలుగు పట్టాల కోసం దళారీకి 6 లక్షల వరకు ఇచ్చినట్లు వీడియో సంభాషణ ద్వారా తెలుస్తోంది.

వీడియో సంభాషణలో దళారి పలుమార్లు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేరును ప్రస్తావించారు. పట్టాల కోసం మీరిచ్చే డబ్బు చాలామంది పెద్దవారికి వాటాలు పంచాలి... తనకు మిగిలేది 20 నుంచి 30 వేలు మాత్రమేనని.. భూమి కొనేందుకు వచ్చిన వ్యక్తితో దళారి నారాయణపాల్‌ చెప్పారు. చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని...పేర్లు చెప్పడం కష్టమన్నారు. తనపై కొందరు సార్‌కు ఫిర్యాదు చేసినా..ఆయన పట్టించుకోలేదని ఆ వీడియోలో ధీమా వ్యక్తం చేశారు నారాయణ పాల్‌. అంటే ఈ వ్యవహారం స్థాయిలో నడుస్తుందో ఇట్టే అర్థం అయిపోతుంది. ప్రభుత్వ భూములను అధికారులు పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story