భగ్గుమంటున్న వర్గపోరు..డిప్యూటీ సీఎం vs ప్రభుత్వ సలహదారు జ్ఞానేంద్ర

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు భగ్గుమంటుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్సెస్ ప్రభుత్వ సలహదారు జ్ఞానేంద్రరెడ్డిగా రాజకీయం కొనసాగుతుంది. ప్రతినిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని జ్ఞానేంద్రరెడ్డి బాంబు పేల్చారు. నారాయణ స్వామి ఎవరిని కలుపుకు పోరని.. అందరిని కలుపుకు పోతేనే కదా వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చేదని చురకలు అంటించారు. అసలు నారాయణ స్వామికి వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియదన్నారు.
జ్ఞానేంద్రరెడ్డి వ్యాఖ్యలపై నారాయణ స్వామి ఫైరయ్యారు. పెనుమూరు మండల సర్వసభ్య సమావేశంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అర్హత ఉన్న వారిని స్టేజ్ మీదకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. తన వర్గంగా భావించి దూరం పెట్టారని ఆరోపంచారు. తాను ఎస్సీ వర్గం కాబట్టే తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గడప గడపకు కార్యక్రమానికి తనతో ఎవరు వెళ్లొద్దని జ్ఞానేంద్రరెడ్డి ఫోన్లు చేశారని ఆరోపించారు. అమెరికాలో ఉంటూ బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్న వారు తనపై విమర్శలు చేస్తున్నారు. ఎస్సీ అనే కారణంతోనే తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని కావాలనే రెచ్చగొడుతున్నారన్న నారాయణ స్వామి..జ్ఞానేంద్రరెడ్డిలా తాను పార్టీలు మారలేదని విమర్శలు గుప్పించారు. జ్ఞానేంద్రరెడ్డి వర్గం వారికే పదవులు ఇచ్చానని.. అయినా తన మీద పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు గడప గడపకు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అడుగడుగునా స్థానికుల నుంచి నిరసన సెగ తగులుతుంది. వైసీపీ ప్రభుత్వంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ ఒక్క పని చేయలేదని నారాయణ స్వామిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే సమయంలో సొంత నేతలపై నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. ఓ బలమైన సామాజికవర్గం రెండు గ్రూప్‌లుగా విడిపోయి తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని నారాయణ స్వామి చెప్పడం పార్టీలో చర్చనీయాంశం అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com