Gulab Cyclone: గులాబ్ తుఫాన్‌తో స్తంభించిన జన జీవనం..

Gulab Cyclone: ఏపీలో గులాబ్ తుపాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై జడివానతో విరుచుకుపడింది. ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నాగావళి ఉగ్రరూపం దాల్చింది.. అటు వంగర మండలం నుంచి శ్రీకాకుళం వరకూ నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫలితంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది.
విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, గజపతినగరం ప్రాంతాల్లో గత రెండురోజుల్లో దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ రిజర్వాయర్లకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఫలితంగా కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయయి.
ఈక్రమంలో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆగ్రామాల ప్రజలంతా చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఔట్ఫ్లో కూడా క్రమంగా తగ్గిస్తున్నామని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశముందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com