Gulab Cyclone News: గులాబ్ తుఫాన్‌తో ఏపీకి ఎంత ఎఫెక్టో..

Gulab Cyclone News: గులాబ్ తుఫాన్‌తో ఏపీకి ఎంత ఎఫెక్టో..
Gulab Cyclone News: గులాబ్‌ తుపాను క్రమేపి బలహీన పడుతోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Gulab Cyclone News: గులాబ్‌ తుపాను క్రమేపి బలహీన పడుతోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంకు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో తుపాన్‌ తీరం దాటగా.. అనంతరం తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెపుతోంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో విజయనగరం జిల్లాలో భారీవర్షం బీభత్సం సృస్టిస్తోంది. ముఖ్యంగా సాలూరు, మక్కువ, రామభద్రపురం ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లో వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో మామూలుగానే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇప్పుడీ వర్షాల ప్రభావంతో వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ నీట మునిగింది. సువర్ణముఖి ఉప్పొంగడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రాత్రి శ్రీకాకుళం మీదుగా తుఫాన్ తీరం దాటినప్పటి నుంచి సాలూరు కమ్యూనిటీ హల్త్ సెంటర్‌లో రాత్రి 10 గంటల నుంచి కరెంట్‌ లేదు. కనీసం మంచినీరు కూడా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి చీకట్లోనే బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కూడా చీకట్లో విధులు నిర్వహించలేక, పేషెంట్ల బాధ చూడలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాచిపెంట మండలం మోసూసు వద్ద కాజ్‌వే తుఫాన్ ధాటికి కొట్టుకుపోయింది. శిధిలావస్థకు చేరిన ఈ కాజ్‌వేకి 10 రోజుల కిందటే గిరిజనులు తమ సొంత డబ్బు 2 లక్షలు పట్టి మరమ్మతులు చేయించారు. ఇప్పుడు వరద ప్రవాహానికి ఇది పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన కారణంగా వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ గిరిజనులకు ఇలాంటి అవస్థలు తప్పడం లేదు.

రామభద్రపురం మండలం పాతరేగ వద్ద ఉన్న 'ఏడు వంపుల గెడ్డ' కూడా ఉప్పొంగింది. చివరికి దానికి గండిపడి పక్కనే ఉన్న పంట పొలాల్ని ముంచెత్తింది. వందలాది ఎకరాలు ఇప్పుడు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ వరిసాగు చేస్తున్న రైతులు.. ఈ వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఓ పక్క వర్షం.. దానికి తోడు పెను గాలుల ప్రభావంతో భారీవృక్షాలు కూడా నేలకూలాయి. మక్కువ నుంచి బొబ్బిలి వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఎదురైంది. ఇప్పుడా చెట్లు తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి.

గజపతినగరం మండలంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. తుఫాన్ ఎఫెక్ట్‌తో ఊళ్లు, చెరువులు ఏకమయ్యాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ముచ్చెర్ల, రంగుపురం సహా 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story