గురజాలలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

పల్నాడు జిల్లా గురజాలలో చిరుత పులి సంచారంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పట్టణంలోని మాడుగుల రోడ్డు వద్ద ఉన్న జియో సెల్ టవర్ సీసీ కెమెరా ఫుటేజ్‌లో చిరుత పులి సంచరిస్తున్నట్లు రికార్డు అవ్వడంతో జియో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర రావు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు.
చిరుత పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించారు. అయితే ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ...ఇప్పటికే ఆ ప్రదేశం చుట్టూ ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత రాత్రి చిరుతపులి ఆనవాలు సీసీ కెమెరాలో రికార్డు కాలేదంటూ అటవీశాఖ అధికారి తెలిపారు. మరికొన్ని రోజులు ఈ ప్రదేశంలో నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. జియో టవర్ చుట్టుపక్కల ప్రదేశం అంతా అపరిశుభ్రంగా ఉండి.. చుట్టూ దట్టమైన చెట్లు పెరగడంతో చిరుతపులులు సంచరించే అవకాశాలు ఉన్నాయని.. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ప్రజలెవరు రాత్రివేళ ఒంటరిగా బయటికి రావద్దని... చిన్న పిల్లలను సాయంత్రం వేళలో ఆరుబయట తిరక్కుండా చూసుకోవాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com