హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

ఏపీలో అక్రమనిర్బంధాలపై హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్నది తేలుస్తామని గతంలో హైకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో నిన్న దీనిపై విచారణ జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అడ్వకేట్‌ను పోలీసులు భయపెట్టడంపై తీవ్రంగా స్పందించి హైకోర్టు.... భయంతో లాయర్లు, జడ్జిలు కోర్టుకు రాకుంటే కోర్టునే మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కేవలం తమ ముందున్న హెబియస్ కార్పస్ పిటిషన్ల వరకే గాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, గతంలో ఇదే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్‌కు సూచించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో కూడా తేల్చాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కూడా దీనిపై విచారణ జరగనుంది.
పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన పి.రవితేజ నిన్న వాదనలు వినిపించారు. తన కుమారుడిని, కోడలిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ రెడ్డి గోవిందరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది షేక్ ఇస్మాయిల్ ఇంటిపై దాడి చేయడంతో పాటు పిటిషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ కారణంగానే ఆయన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు సిద్ధపడ్డారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో జరిగిన జ్యుడీషియల్ విచారణలో ఆ విషయం స్పష్టమైందని కోర్టుకు వెల్లడించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దంపతుల అక్రమ నిర్బంధంపై జ్యుడీషియల్ విచారణ చేపట్టిన విశాఖ సీనియర్ సివిల్ జడ్జిని ధర్మాసనం ప్రశంసించింది. పోలీసు బృందం కూడా చేయలేనంత దర్యాప్తును ఒంటరిగా పూర్తిచేసి, సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించారని అభినందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com