ఏపీలో సెగలురేపుతున్న సూరీడు

ఏపీలో టెంపరేచర్ టెంపర్ రేపుతోంది. భానుడి భగభగలకు సెగలు రేపుతున్నాయి. 44 డిగ్రీలు దాటి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఓవైపు చండ ప్రచండమై ఠారెత్తిస్తుంటే.. మరోవైపు రోజురోజుకు వడగాల్పుల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే సూరీడు సుర్రమంటుంటే.. తీవ్రరూపం దాల్చుతున్న ఉష్ణోగ్రతలతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిలా సలసల కాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండలకు తోడు వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. మరో రెండ్రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఏపీలోని 73 మండలాల్లో, రేపు 12 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపింది. అయితే మండిపోతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com